ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు కష్టాలు పెరుగుతున్నాయి. ఢిల్లీ లిక్కర్ కేసులో ఆయనను 10 రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని ఈడీ.. కోర్టును కోరింది. ఈ కేసులో ఆయనకు ప్రొడక్షన్ వారంట్ జారీ చేయాలని రౌజ్ ఎవెన్యూ కోర్టును అభ్యర్థించింది. దీన్ని పరిశీలిస్తామని కోర్టు హామీ ఇచ్చినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి.
శుక్రవారం మధ్యాహ్నం 2 గంటలకు సిసోడియాను కోర్టులో హాజరు పరచాలని కూడా జడ్జి ఆదేశించినట్టు ఈ వర్గాలు చెప్పాయి. మనీలాండరింగ్ కేసులో ఆయనను నిన్న తీహార్ జైల్లోనే అరెస్టు చేసిన ఈడీ..సుమారు 45 నిముషాలపాటు విచారించింది.
ఇప్పటికే ఆయన 14 రోజుల జుడిషియల్ కస్టడీలో ఉన్నారు. ఇక ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్ పై కోర్టు మరికొద్ది గంటల్లో తీర్పునివ్వనుంది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్ ని వ్యతిరేకిస్తూ దీన్ దయాళ్ మార్గ్ లో బీజేపీ నిరసనలు కొనసాగుతున్నాయి. ఆప్ నేతలు, జైల్లో వారి రాచభోగాలపై ఈ పార్టీ నేతలు మోడల్ జైళ్లను ప్రదర్శిస్తూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. సీఎం అరవింద్ కేజ్రీవాల్ రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. సత్యేంద్ర జైన్ కి మసాజ్ చేస్తున్నట్టుగా కార్యకర్తలు వెరైటీ నిరసనకు కూచున్నారు.