టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి తెరపైకొచ్చింది. ఈకేసు వివరాల కోసం ఎక్సైజ్ కు మరోసారి ఈడీ లేఖ రాసింది. నిందితులు, సాక్షుల వాగ్మూలాలు, కాల్ డేటా, డిజిటల్ రికార్డులు కావాలని తెలిపింది.
ఎన్నిసార్లు అడిగినా రాష్ట్రప్రభుత్వం సహకరించడం లేదని ఈడీ అధికారులు ఇటీవలే హైకోర్టుకు ఫిర్యాదు చేశారు. కేసుకు సంబంధించిన వివరాలు ఇవ్వడం లేదని వివరించారు. ఈ నేపథ్యంలో ఆగ్రహం వ్యక్తం చేసిన న్యాయస్థానం.. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ ఈడీకి ఇవ్వాలని ఆదేశించింది. దీంతో ఎక్సైజ్ కు మరోసారి లేఖ రాసింది ఈడీ.
ఈడీ ఫిర్యాదు సమయంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. విచారణకు ప్రభుత్వం సహకరించాలని స్పష్టం చేసింది. దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకోవాలని తెలిపింది. ఈడీ దరఖాస్తు చేస్తే 15 రోజుల్లో వివరాలు ఇవ్వాలని ఆదేశించింది. కేసుతో ప్రమేయం ఉన్న వారి కాల్ డేటా సహా అన్ని వివరాలను అధికారులకు నెల రోజుల్లో అప్పగించాలని ప్రభుత్వాన్ని ఆదేశిస్తూ తీర్పునిచ్చింది.
కోర్టు ఆదేశాలతో టాలీవుడ్ డ్రగ్స్ కేసు మరోసారి చర్చనీయాంశమైంది. తాజాగా డిజిటల్ రికార్డులు, కాల్ డేటా వివరాలు ఇవ్వాలని ఎక్సైజ్ శాఖకు ఈడీ లేఖ రాసింది.