కొద్ది రోజులుగా దర్యాప్తు సంస్థల దూకుడు వెనుక కేంద్రం ఉందని ప్రతిపక్షాలు నిందిస్తున్నాయి. ఈడీ, సీబీఐని అడ్డుపెట్టుకుని వేధిస్తున్నారని మోడీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్నారు నేతలు. ఇప్పటికే కాంగ్రెస్ నేత కార్తీ చిదంబరంపై సీబీఐ ఫోకస్ పెట్టగా… ఏకంగా ఢిల్లీ మంత్రి సత్యేంద్ర జైన్ ను ఈడీ అరెస్ట్ చేసింది. వీటిపై మాటల యుద్ధం కొనసాగుతుండగానే.. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, అగ్రనేత రాహుల్ గాంధీకి ఈడీ సమన్లు పంపింది.
నేషనల్ హెరాల్డ్ వ్యవహారానికి సంబంధించి ఈ నోటీసులు వెళ్లాయి. ఈ నెల 8న తమ కార్యాలయానికి విచారణకు రావాలని ఈడీ అందులో పేర్కొంది. మనీలాండరింగ్ ఆరోపణలపై ఈ నోటీసులు జారీ చేశారు అధికారులు. ఈ విషయాన్ని కాంగ్రెస్ అధికార ప్రతినిధి రణదీప్ సూర్జేవాలా వివరించారు. ఈడీ నోటీసులపై సీరియస్ అయ్యారు.
నేషనల్ హెరాల్డ్ పేరుతో స్వాతంత్య్ర సమరయోధులను బీజేపీ అవమానించిందని అన్నారు సుర్జేవాలా. మోడీ పెంపుడు సంస్థగా ఈడీ పని చేస్తోందని మండిపడ్డారు. ఇద్దరు కాంగ్రెస్ ప్రముఖ నేతలకు నోటీసులు ఇవ్వడాన్ని పిరికిపంద చర్యగా ఆయన పేర్కొన్నారు. జూన్ 8న సోనియా గాంధీ ఈడీ కార్యాలయానికి వెళ్తారని అభిషేక్ మను సింఘ్వీ తెలిపారు. రాహుల్ విదేశీ పర్యటనలో ఉన్నారని.. ఆలోపు తిరిగి వస్తే హాజరవుతారని లేకపోతే కొంత సమయం కోరే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.
కాంగ్రెస్ కు నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న రూ.90.25 కోట్లను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని సుబ్రహ్మణ్యస్వామి గతంలో ఆరోపించారు. దానికి సంబంధించి సోనియా, రాహుల్ సహా ఏడుగురిపై ఢిల్లీలోని అడిషనల్ చీఫ్ మెట్రోపాలిటన్ మెజిస్ట్రేట్ కోర్టులో కేసు వేశారు. కేవలం రూ.50 లక్షల చెల్లింపుతో ఆ హక్కును పొందేందుకు వారు ప్రయత్నించారని పిటిషన్ లో ఆరోపించారు. ఈ కేసు విచారణలో భాగంగా ఇటీవలే మల్లికార్జున్ ఖర్గే, పవన్ బన్సల్ ను ఈడీ ప్రశ్నించింది. తాజాగా సోనియా, రాహుల్ కు నోటీసులు పంపింది.