ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు అక్కడక్కడే తిరుగుతోంది కానీ, ఏదీ తేలడం లేదు. కోర్టులో వాయిదాలు, అరెస్ట్ అయిన వారి విచారణలతో సరిపోతోంది. తాజాగా మరొకరిని విచారించేందుకు ఈడీ రెడీ అయ్యింది. ఆయన ఎవరో కాదు.. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాజీ ఆడిటర్ గోరంట్ల బుచ్చిబాబు. సీబీఐ అరెస్టు చేసిన కేసులో బుచ్చిబాబు జైలులో ఉన్నాడు.
రెండు రోజుల పాటు బుచ్చిబాబును విచారించేందుకు ఈడీ అధికారులు సీబీఐ ప్రత్యేక కోర్టును అనుమతి కోరారు. ఈ వినతిపై న్యాయస్థానం సానుకూలంగా స్పందించి అనుమతినిచ్చింది. లిక్కర్ స్కాంలో సౌత్ గ్రూప్ కీలకంగా ఉండడంతో దీనికి సంబంధించిన కీలక సమాచారం రాబట్టేందుకు బుచ్చిబాబును ప్రశ్నించాలని ఈడీ అనుకుంటోంది. అందుకే కోర్టును కోరింది.
మనీలాండరింగ్ కేసును విచారిస్తున్న ఈడీ.. గురువారం నుంచి రెండు రోజుల పాటు బుచ్చిబాబును ప్రశ్నించనుంది. ప్రస్తుతం అతను ఉన్న తీహార్ జైలులోనే ప్రత్యేకంగా విచారించే అవకాశం ఉంది. గతంలోనూ పలుమార్లు తమ కార్యాలయానికి పిలిపించి బుచ్చిబాబును అధికారులు ప్రశ్నించారు. కీలక సమాచారం రాబట్టారు.
ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి బుచ్చిబాబును ఈనెల 7వ తేదీన సీబీఐ అధికారులు అరెస్ట్ చేశారు. ఆ తర్వాత విచారణకు సహకరించకపోవడంతో అతడిని కోర్టులో హాజరుపరుచగా మూడు రోజుల కస్టడీకి కోర్టు అనుమతి ఇచ్చింది. కస్టడీ ముగిసిన తర్వాత ఈనెల 25 వరకు జ్యుడీషియల్ రిమాండ్ విధించింది.
ఈ కేసులో ఎమ్మెల్సీ కవితపై ఆరోపణలు వస్తుండగా ఆమెకు గతంలో ఆడిటర్ గా పని చేసిన బుచ్చిబాబును ప్రశ్నించేందుకు ఈడీకి కోర్టు అనుమతి ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. రానున్న రోజుల్లో ఈ కేసు ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనేది చర్చనీయాంశం అవుతోంది.