టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మరింత లోతుగా ఈడీ దర్యాప్తు చేస్తోంది. ఆధారాల కోసం ఈడీ ఇప్పటికే ఎక్సైజ్ శాఖకు లేఖ రాసింది. 2017లో టాలీవుడ్ స్టార్స్ తో పాటు.. మొత్తం 41 మంది కాల్ డేటా రికార్డింగ్స్ ను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది. వీరిపై 2017లో 12 ఎఫ్ఐఆర్లను ఎక్సైజ్ శాఖ నమోదు చేసింది.
డ్రగ్స్ నిందితులతో పాటు సాక్షుల నుంచి కాల్ డేటా రికార్డింగ్స్ తీసుకున్నామని ఎక్సైజ్ సూపరిండెంట్ శ్రీనివాస్ ఈడీకి తెలిపారు. విచారణ సందర్భంగా అందరి కాల్ డేటా రికార్డింగ్స్ ను ఎక్సైజ్ శాఖ సేకరించింది. నిందితుడు కెల్విన్ మొబైల్ ఫోన్ ను సైతం ఎక్సైస్ శాఖ సీజ్ చేసింది. డ్రగ్స్ ఫెడ్లర్ కెల్విన్ తో స్టార్స్ కు ఉన్న సంబంధాల ఆధారాల కోసం స్టార్స్ కాల్ డేటా రికార్డింగ్స్ ను సైతం ఎక్సైజ్ శాఖ తీసుకుంది.
అయితే ఈ డేటా ఇప్పటి వరకూ ఈడీకి అందలేదు. ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్ లతో పాటు.. ఎక్సైజ్ శాఖ సీజ్ చేసిన ఒరిజినల్ మెటీరియల్ ను ఇవ్వాలని ఈడీ కోరింది.
అవి ట్రైల్ కోర్టులో ఉన్నాయని ఎక్సైజ్ శాఖ సమాధానం చెప్పింది. అయితే.. కోర్టుకు ఎక్సైజ్ శాఖ సమర్పించిన వాంగ్మూలాల కాపీలు మాత్రమే తమకు అందాయని.. అందులో కాల్ రికార్డింగ్స్ లేవని ఈడీ చెప్తోంది. ఈ వ్యవహారాన్ని తిరిగి కోర్టు దృష్టికి తీసుకొచ్చే యోచనలో ఈడీ ఉన్నట్టు తెలుస్తోంది.