ప్రముఖ ఎడిటర్ గౌతం రాజు కన్నుమూశారు. అనారోగ్య సమస్యలతో తుదిశ్వాస విడిచారు. ఈయన మృతిపై సినీ ప్రముఖులు దిగ్భ్రాంతికి లోనయ్యారు.
కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతున్న గౌతం రాజుకు కుటుంబ సభ్యులు చికిత్స అందిస్తున్నారు. ఓ ప్రముఖ ఆస్పత్రిలో ట్రీట్ మెంట్ తీసుకుంటున్న ఆయన.. మంగళవారమే డిశ్చార్జి అయ్యారు. కానీ.. అర్ధరాత్రి దాటాక పరిస్థితి విషమించింది.
గౌతంరాజు మృతిపై సినీ ప్రముఖులు విచారం వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. గౌతంరాజు కుటుంబసభ్యులకు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. మహా ప్రస్థానంలో ఆయన అంత్యక్రియలకు ఏర్పాట్లు చేశారు.
800కు పైగా సినిమాలకు పని చేశారు గౌతం రాజు. సౌత్ భాషల్లోని మూవీలే కాకుండా హిందీ చిత్రాలను కూడా వర్క్ చేశారు. గబ్బర్ సింగ్, రేసు గుర్రం, గోపాల గోపాల, ఖైదీ నెంబర్ 150, అదుర్స్, బలుపు సహా ఎన్నో సూపర్ హిట్ చిత్రాలకు ఎడిటర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. చట్టానికి కళ్లు లేవు సినిమాకు మొదటిసారిగా ఎడిటర్ గా పనిచేశారు.