గుంటూరు: రైతు భరోసా పథకం అమల్లో కచ్చితత్వం పాటిస్తామంటున్న ఏపీ అధికారులు చేతల్లో సిత్రాలు చూపుతున్నారు. అన్ని అర్హతలున్న సగటు రైతుకు పథకం అమల్లో ఏవో సాకులతో చుక్కలు చూపుతున్న అధికారులు ప్రకాశం జిల్లాలో ఏకంగా లబ్దిదారుడిగా విద్యాశాఖమంత్రి ఆదిమూలపు సురేష్ పేరు జాబితాలో చేర్చారు.
జాబితాలో సగటు రైతు పేరు చేరాలంటే మూడు చెరువుల నీరు తాగిస్తున్న సీన్ కొన్ని చోట్ల ఉంది. ఆన్ లైన్లో పొలం ఉన్నట్లు ఆధారం ఉన్నా, ఇంకా ఏవో కావాలంటూ కొందరు అధికారులు సగటు రైతులను తిప్పుతున్నారు. కానీ మంత్రి పేరును ఈజీగా జాబితాలో చేర్చిన తీరు విచిత్రం.
నిబంధనల ప్రకారం ప్రజాప్రతినిధులు, ఉద్యోగులు, ఆదాయపు పన్ను చెల్లింపుదారులు రైతు భరోసా పథకానికి అర్హులు కాదు. అసలు నిబంధనలకు విరుద్ధంగా ఏకంగా విద్యాశాఖామంత్రి ఆదిమూలపు సురేష్‌ను ఎలా చేర్చారన్నది ప్రశ్నార్ధకం. దీనిపై ప్రకాశం జిల్లా అధికారులు ఏమి సమాధానం చెబుతారో వేచి చూడాల్సిందే.
రైతు భరోసా జాబితాలో తన పేరు నమోదు విషయం తెలియగానే విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ స్పందించారు. వ్యవసాయ శాఖ అధికారులతో మాట్లాడి వివరణ కోరానని చెప్పారు. ఈ ఘటనపై విచారణ జరపాలని వ్యవసాయశాఖ అధికారులను ఆదేశించారు. అధికారులు సరిగ్గా పరిశీలించక పోవటంతో జాబితాలో పొరపాటు జరిగి ఉంటుందని మంత్రి అభిప్రాయం. పూర్తి స్థాయిలో పరిశీలించిన తరువాతే తుది జాబితా ప్రకటించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.