– రాష్ట్రంలోని స్కూళ్లలో వసతులు కరువు
– మాటల్లోనే.. ‘మన ఊరు మన బడి’
– ఎనిమిదేళ్లుగా విద్యావ్యవస్థపై నిర్లక్ష్యం
– పైగా.. ఢిల్లీలో సూపర్ అంటూ ప్రశంసలు
– ఇక్కడి వారిని అక్కడికి పంపుతే ఉపయోగం ఏంటి?
– పిల్లలకు కావాల్సింది టూర్లా? వసతులా?
– కేసీఆర్ తీరుపై విద్యావేత్తల ఆగ్రహం
‘ఇంట గెలిచి రచ్చ గెలువు’ అని పెద్దలు చెప్తుంటారు. ఆ సామెతను తెలంగాణ సీఎం కేసీఆర్ మార్చేసినట్లున్నారు. మొదట ఇంట కాదు రచ్చ గెలవాలన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఢిల్లీ స్కూల్స్‌ను సందర్శించిన కేసీఆర్..అవి బాగున్నాయని ప్రశంసిస్తున్నారు. మరి..ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణలోని పాఠశాలలపైన ఎందుకు దృష్టి పెట్టలేదన్న ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పేందుకు సిద్ధంగా లేరు. దేశరాజధాని ఢిల్లీలోని పాఠశాలల సందర్శనకు సీఎం కేసీఆర్‌కు సమయం ఉంది కానీ, తన సొంత రాష్ట్రమైన తెలంగాణలోని స్కూల్స్ సందర్శనకు టైం లేదా? అని విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
రాష్ట్రంలోని పాఠశాలల సందర్శనకు కనీసం ఒక్కసారైనా సీఎం కేసీఆర్ వెళ్లిన దాఖలాలు లేవు. కనీస మౌలిక వసతులు లేక పాఠశాలలు దయనీయ స్థితిలో ఉన్నాయి. స్కూల్స్ కు ఇటువంటి దుస్థితి ఏర్పడానికి కారణం ప్రభుత్వ నిర్లక్ష్యమేనని విద్యావేత్తలు అంటున్నారు. ఎనిమిదేళ్ల కాలంలో సర్కారు విద్యావ్యవస్థపైన కనీసంగా దృష్టి పెట్టలేదని విమర్శిస్తున్నారు. తెలంగాణ ఉపాధ్యాయులను ఢిల్లీకి పంపి అక్కడి విధానాలను అధ్యయనం చేస్తామని కేసీఆర్ ఇప్పుడు పేర్కొనడం మరో నాటకానికి తెర లేపడమేనని వివరిస్తున్నారు. ఇన్నేళ్లు కేసీఆర్ ఏం చేశారని అడుగుతున్నారు. బడుల బాగు కోసం ప్రవేశపెట్టిన ‘మన ఊరు-మన బడి’ పథకానికి ప్రభుత్వం ఎందుకు డబ్బులు ఇవ్వడం లేదని ప్రశ్నిస్తున్నారు.
ఇక స్కూల్స్‌ను బాగు చేసేందుకు ప్రయత్నించిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు తెలంగాణ సర్కారు పొమ్మనలేక పొగబెట్టింది. రిటైర్డ్ ఐఏఎస్ ఆకునూరి మురళి తెలంగాణ స్కూల్స్ పైన స్పెషల్ ఫోకస్ పెట్టి వాటిని అభివృద్ధి చేయడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలోనే పాఠశాలల దుస్థితిపైన సంచలన విషయాలు బయటపెట్టారు. కనీస మౌలిక వసతులు లేని పాఠశాలలపైన ప్రభుత్వం దృష్టి సారించాలని ఆకునూరి మురళి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వంటి విద్యావేత్తలు సూచించారు. కానీ, ప్రభుత్వం వారి సూచనలను పెద్దగా పట్టించుకోలేదు.
రాష్ట్రంలో విద్యారంగానికి ఏటా కేటాయింపులు పెంచాల్సింది పోయి తగ్గించడాన్ని విద్యావేత్తలు తప్పు బడుతున్నారు. కనీస మౌలిక వసతులకు నోచుకోని పాఠశాలల ద్వారా ప్రగతి ఎలా సాధ్యమవుతుందని అడుగుతున్నారు. జాతీయ రాజకీయాలలో కీలక భూమిక పోషించాలని తహ తహ లాడుతున్న సీఎం కేసీఆర్ తొలుత తెలంగాణ రాష్ట్రంలోని విద్యావ్యవస్థపైన, స్కూల్స్ పైన ఫోకస్ చేయాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. రాజకీయాలు మాని అభివృద్ధిపైన దృష్టి పెట్టాలని కోరుతున్నారు.