– 2014 నుంచి అదే మోసం!
– ఇచ్చిన హామీలెన్ని.. అమలు చేసినవెన్ని?
– నిజంగా 80వేల ఉద్యోగాలే ఉన్నాయా?
– విద్యావేత్తలు ఏం చెప్తున్నారు?
– నిరుద్యోగ భృతి సంగతేంటి?
అసెంబ్లీ సాక్షిగా రేపే నోటిఫికేషన్ అని ప్రకటించారు సీఎం కేసీఆర్. 80వేల ఉద్యోగాలు భర్తీ చేస్తున్నామని చెప్పారు. కానీ.. ‘అప్పు రేపు’ మాదిరిగా కేసీఆర్ ప్రకటన మారిందనే విమర్శలు వస్తున్నాయి. వెంటనే నోటిఫికేషన్లు వస్తాయని సీఎం ప్రకటించినా ఇంతవరకు వాటి జాడ లేకపోవడంతో నిరుద్యోగులు మరింత రగిలిపోతున్నారు. పుండు మీద కారం జల్లినట్టు.. ఇన్నాళ్లూ ఉద్యోగాల ఊసెత్తకుండా కడుపు మాడ్చి.. తీరా ప్రకటన చేశాక కూడా అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
కేసీఆర్ హామీలే ఇస్తారు.. వాటి అమలు గురించి మర్చిపోవాల్సిందేనని ఇటు రాజకీయ పండితులు సైతం 2014 నుంచి జరిగిన విషయాలను గుర్తు చేస్తున్నారు. తెలంగాణ వచ్చాక 2014లో అసెంబ్లీలో కేసీఆర్ ఓ ప్రకటన చేశారు. రాష్ట్రంలో 1.07 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని.. అన్నీ భర్తీ చేస్తామన్నారు. కానీ.. విభజన సమయంలో రాష్ట్రానికి కేటాయించిన పోస్టులు 5,23,675. అందులో ఉద్యోగులు 3,15,849. ఖాళీలు 2,18,826. కేసీఆర్ మాత్రం 1,07,744 మాత్రమే ఖాళీగా ఉన్నాయని ప్రకటించారు. అప్పుడే అబద్ధం చెప్పారని.. లక్షకు పైగా ఉద్యోగాలను దాచిపెట్టారని అంటున్నారు విశ్లేషకులు. సరే.. ప్రకటించిన 1.07 లక్షల ఉద్యోగాలన్నా భర్తీ చేశారా అంటే అదీ లేదు. కానీ.. మొన్నటి అసెంబ్లీ సమావేశాల సందర్భంగా మాట్లాడుతూ.. 1.30 లక్షల ఉద్యోగాలు ఇచ్చామని ప్రకటించారు. వాస్తవాలను దాచి పెట్టి కేసీఆర్ మాయ చేస్తున్నారని చెబుతున్నారు రాజకీయ పండితులు.
నిజానికి కేసీఆర్ చాలా హామీలు ఇచ్చారు. ఇంటికో ఉద్యోగం అన్నారు.. ఇవ్వలేదు. పేదలకు డబుల్ బెడ్రూం ఇల్లు అన్నారు.. ఇప్పటికీ పూర్తి కాలేదు. దళితులకు మూడెకరాల భూమి అన్నారు.. తర్వాత అనలేదని చెప్పారు. దళిత సీఎం హామీ ఇచ్చి మర్చిపోయారు. దళిత బంధును తెరపైకి తెచ్చి.. దాని ఊసే ఎత్తడం లేదు. కేజీ టు పీజీ ఉచిత విద్య సంగతే మర్చిపోయారు. ఇలా అనేక హామీలతో కేసీఆర్ ప్రజలను బట్టులో వేసుకున్నారని గుర్తు చేస్తున్నారు. గత రెండు ఎన్నికల్లోని మేనిఫెస్టోల ఆధారంగా ఈ విషయాలను వివరిస్తున్నారు. టీఆర్‌ఎస్ మేనిఫెస్టోలు అద్భుతంగా ఉంటాయని.. కానీ.. అమల్లో మాత్రం ఏమీ ఉండదని అంటున్నారు. అచ్చం.. అహనా పెళ్లంట సినిమాలోని కోడి సీన్ టైపులో ఉంటుందని చెబుతున్నారు విశ్లేషకులు.
ఇటు విద్యావేత్తలు సైతం కొన్ని ప్రశ్నలను లేవనెత్తుతున్నారు. 2014 నుంచి 2022 వరకు 2.18 లక్షల ఉద్యోగాల వరకు ఖాళీగా ఉన్నాయి. కానీ.. 80వేలే అని కేసీఆర్ చెప్తున్నారు. బిశ్వాల్ కమిటీ నివేదిక ప్రకారం 1.91 లక్షల ఉద్యోగాలు ఉండాలి.. మరి.. 80వేలే ఉంటే మిగిలిన 1.10 లక్షల ఉద్యోగాలు ఎవరు ఎత్తుకుపోయారని ప్రశ్నిస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ అసెంబ్లీలో చెప్పిన ఓ విషయాన్ని గుర్తు చేస్తున్నారు. ప్రపంచంలో ఏ ప్రభుత్వం కూడా 5 శాతానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వడం కుదరదని కేటీఆర్ గతంలో అసెంబ్లీలో చెప్పారు. దాని ప్రకారంగా రాష్ట్ర జనాభాలో 5 శాతం అంటే 20 లక్షల ఉద్యోగాలు ఉండాలిగా.. కానీ.. 5 లక్షలు కూడా లేవని నిలదీస్తున్నారు విద్యావేత్తలు. పైగా ప్రపంచంలో ఏ దేశంలో కూడా ఒకే కుటుంబానికి చెందిన ఆరుగురు కేబినెట్ హోదాలో ఉంటారా? అంటూ సెటైర్లు వేస్తున్నారు.
కేసీఆర్ ఇచ్చిన నిరుద్యోగ భృతి హామీపైనా మండిపడుతున్నారు విద్యావేత్తలు. 2018 మేనిఫెస్టోలో నిరుద్యోగులకు నెలకు రూ.3,016 భృతి ఇస్తామని కేసీఆర్ చెప్పారు. ఏళ్లు గడుస్తున్నాయే గానీ దాని ఊసే లేదు. మొన్నటి బడ్జెట్ లో కూడా నిరుద్యోగులను నిరాశ పరిచారు. ఒక్క రూపాయి కూడా కేటాయించలేదు. అసెంబ్లీలో ఉద్యోగాల గురించి వివరణ ఇచ్చిన కేసీఆర్ సైతం భృతి విషయం మాట్లాడలేదు. హామీ ఇచ్చిన రోజు నుంచి ఇప్పటిదాకా నాలుగేళ్ల భృతి బకాయి పడ్డారు కేసీఆర్. అంటే ఒక్కో నిరుద్యోగికి రూ.1.20 లక్షల భృతి బాకీ పడినట్లేనని చెబుతున్నారు విద్యావేత్తలు.
సాధారణంగా ఉద్యోగ నోటిఫికేషన్ అంటే కేబినెట్ ఆమోదం ఉండాలి. కానీ.. కేసీఆర్ హడావుడిగా మొన్న ప్రకటన చేశారు. వెంటనే నోటిఫికేషన్లు వస్తాయన్నారు. కానీ.. ఇంతవరకు అది కార్యరూపం దాల్చలేదు. బిశ్వాల్ కమిటీ 1.91 లక్షల ఖాళీల లెక్కల్ని పక్కనపడేసి.. 80వేలే ఉన్నాయని చెప్పారు. నిజానికి రిటైర్డ్ అయిన వారి ఖాళీలను కలుపుకుని రాష్ట్రంలో 2.20 లక్షల ఉద్యోగాల వరకు ఖాళీగా ఉన్నాయని చెబుతున్నారు విద్యావేత్తలు. నిరుద్యోగులేమో 50 లక్షల మంది వరకు ఉంటారని అంచనా వేస్తున్నారు. మరి.. వారందరికీ 80వేలు సరిపోతాయా? అని ప్రశ్నిస్తున్నారు. వెంటనే 1.91 లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇవ్వాలని.. కోచింగ్ సెంటర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తొలివెలుగు కూడా ఓ సూచన చేసింది. ప్రతీ సెలెబ్రిటీ నిరుద్యోగులను దత్తత తీసుకోవాలని అంటోంది. ప్రతీ పార్టీ నేత కనీసం వంద మంది నిరుద్యోగులను దత్తత తీసుకోవాలని పిలుపునిచ్చింది.