సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనపై బీజేపీ నేత ఈటల రాజేందర్ ఘాటుగా స్పందించారు. బీఆర్ఎస్ ప్రకటనతో సీఎం కేసీఆర్‌కు తెలంగాణతో ఉన్న సంబంధం తెగిపోయిందన్నారు. ఉద్యమ పార్టీని ఖతం పట్టించి, ఉద్యమకారులను మరిచిపోయేటట్టు చేశారని అన్నారు.
చివరకు కేసీఆర్ ముద్ర ఉండే పార్టీని స్థాపించారని మండిపడ్డారు. అందువల్ల బీఆర్ఎస్ స్థాపనతో తెలంగాణాకు కేసీఆర్‌కు ఉన్న బంధం పూర్తిగా తెగిపోయిందన్నారు. తెలంగాణా ప్రజానీకానికి టీఆర్ఎస్ పార్టీకి ఉండే బంధం కట్ అయిపోయిందన్నారు.
తెలంగాణ ఉద్యమకారులకు, తెలంగాణ చైతన్యానికి కేసీఆర్‌కు ఉన్న బంధం తెగిపోయిందన్నారు. బీఆర్ఎస్ పార్టీని పెట్టుకున్న తర్వాత కేసీఆర్ కేవలం మద్యాన్ని, డబ్బుని ప్రలోభాలను మాత్రమే నమ్ముకున్నారని తెలిపారు.
అక్రమంగా సంపాదించుకున్న డబ్బును దేశంలో రాజకీయంగా చెలామణి చేయాలని సీఎం కేసీఆర్ కలలు కంటున్నారని ఆయన మండిపడ్డారు. అది కలగా మిగిలిపోతుందో చూడాలన్నారు. కూట్లో రాయి తీయలేనోడు ఎట్లో రాయి తీయడానికి పోయినట్టు కేసీఆర్ తీరు ఉందన్నారు.
తెలంగాణ ప్రజల సమస్యలు పరిష్కరించలేని వ్యక్తి.. అన్ని రకాలుగా ప్రజల విశ్వాసం కోల్పోయి, ఇప్పుడు వాళ్లు ఇబ్బందులు పడుతుండగా ఆ సంప్రదాయాన్ని, ఆ దుఃఖాన్ని దేశం మీద రుద్దే ప్రయత్నాన్ని కేసీఆర్ చేస్తున్నారని ఈటల అన్నారు.