హైదరాబాద్: ఈటల మంత్రి పదవి పోవడం ఖాయమని, అయితే ప్రస్తుతానికి వాయిదా పడిందని ముఖ్యమంత్రి సన్నిహితులు చెబుతున్నారు. ముఖ్యమంత్రి వైఖరిని బట్టి చూస్తే ఆలె నరేంద్ర, విజయశాంతి, దేశిన చిన మల్లయ్య, మృత్యుంజయ లాంటి వారంతా బిగ్‌బాస్ కోపాగ్రి బలయ్యారని, కేసీఆర్‌తో సమానంగా ఉన్నామని భావించిన నేతలెవరూ ఎక్కువ కాలం పదవుల్లో ఉండరని వారి విశ్లేషణ. పలుకుబడి పెంచుకోవాలన్న రాజయ్య, స్వామిగౌడ్, కడియంలకు ఎదురైన పరిస్థితి గుర్తుంచుకోవాలని వారంటున్నారు. ఈటల ‘కొడకా..గులాబీ ఓనర్ల మేం’ అని చెప్పడం, ఎవరి దయా దాక్షణ్యాలతో మంత్రి పదవి రాలేదని చెప్పడం ఆగ్రహానికి దారితీసిందని వారు చెబుతున్నారు. అయితే బీసీ ఫాక్టర్ కారణంగా ఈటలను ఇప్పటికిప్పుడు పక్కన పెట్టరని, మెల్లగా తీసేస్తారని వారంటున్నారు. బీసీ వర్గానికి చెందిన గంగుల కమలాకర్‌కు పదవినివ్వడం ఈటలకు ఎర్త్ పెట్టడానికేనని వారు చెపుతున్నారు. మంత్రి పదవికి అన్నివిధాలుగా అర్హుడు వినయ్ భాస్కర్ ఉన్నప్పటికీ కమలాకర్ ఎంపిక జరిగిందని సారు సన్నిహితుల వ్యాఖ్య.
పదవి వొద్దన్న ఎమ్మెల్యే
శేరిలింగంపల్లి ఎమ్మెల్యే గాంధీ పదవి వద్దని చెప్పి సంచలనం సృష్టించారు. మంత్రివర్గ విస్తరణ సమయంలో గాంధీ తనకు ఇస్తానన్న విప్ పదవిని వద్దన్నారు. విప్ పదవిలో నియమించిన మిగతావారి స్థాయికి తగ్గలేనని, సరైన హోదా వచ్చేవరకూ వేచిచూస్తానని గాంధీ చెపుతున్నారు.