మంత్రి మల్లారెడ్డిపై జరిగిన దాడి రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారింది. కాంగ్రెస్ నాయకులే తనపై దాడికి పాల్పడ్డారని మల్లారెడ్డి ఆరోపిస్తుండగా.. హస్తం నేతలు కౌంటర్లు ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో మాటల యుద్ధం తారాస్థాయికి చేరుతోంది. ఈక్రమంలోనే బీజేపీ నేతలు కూడా స్పందిస్తున్నారు.
మల్లారెడ్డిపై దాడి వ్యక్తిగతం కాదు.. ప్రభుత్వంపై రైతులకు ఉన్న వ్యతిరేకతని వ్యాఖ్యానించారు హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. సీఎం ఇచ్చిన హామీలను నెరవేర్చకపోవడం వల్లే ప్రజలు ఆగ్రహానికి గురయ్యారని విమర్శించారు. గిరిజనులకు రిజర్వేషన్లు అని చెప్పి పీఠముడి వేసి రాకుండా చేసిన దుర్మార్గుడు కేసీఆర్ అని మండిపడ్డారు. తెలంగాణలో టీఆర్ఎస్ ఉనికి కోల్పోతోందనడానికి మల్లారెడ్డిపై రైతులు చేసిన దాడే నిదర్శనమన్నారు.
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడిన చందంగా ధరణి మారిందన్నారు ఈటల. పరువు హత్యలు జరుగుతుంటే.. సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారని విమర్శలు గుప్పించారు. శాంతి భద్రతలను కాపాడటంలో కేసీఆర్ పూర్తిగా విఫలమయ్యారని మండిపడ్డారు. అందుకు నైతిక బాధ్యతగా.. తక్షణమే కేసీఆర్ తన పదవికి రాజీనామా చేసి పాలన చేతకాదని ఒప్పుకోవాలని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దివాలా తీసిందన్న ఈటల.. ప్రభుత్వం పెట్టిన బడ్జెట్ మొత్తం బోగస్ అని ఆరోపించారు. ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ఇక రెడ్డి, వెలమ గురించి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపైనా స్పందించారు ఈటల. అందరికీ సమన్యాయం ఉండాలి తప్ప..ఇలాంటి పరిస్థితి ఉండొద్దన్నారు.