టీఆర్ఎస్ ప్రభుత్వం అప్పులు చేసి రాచరికం అనుభవించడం తప్ప.. అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని ఆరోపించారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. హైదరాబాద్ నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా కేసీఆర్ పాలనపై తీవ్ర విమర్శలు చేశారు. కేసీఆర్ డొల్లతనాన్ని కాంగ్రెస్ బయటపెట్టిందన్నారు.
ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను.. అప్పుల కుప్ప చేశారని విరుచుకుపడ్డారు. రాష్ట్రం అప్పు ఇప్పటికే రూ. 5 లక్షల కోట్లు దాటిందని వెల్లడించారు. కార్పొరేషన్లు సైతం అప్పు తీర్చే పరిస్థితి లేదని వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో మంత్రుల మాటకు విలువ లేదని.. వారివారి శాఖల మీద వారికే అవగాహన లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు ఈటల.
మిల్లర్లు క్వింటాకు 8 కిలోల తరుగు తీస్తున్నా.. పట్టించుకునే నాధడే కరువయ్యాడని ఆవేదన వ్యక్తం చేశారు. మద్యం దుకాణాల్లో నిల్వ ఉన్న లిక్కర్ పై కొత్త ధరలు అమలు చేసి సొమ్ము చేసుకుంటున్నారని విమర్శించారు. నిరంకుశంగా వ్యవహరించిన రాజకీయ నేతలకు గతంలో ఏ గతి పట్టిందో.. అదే గతి కేసీఆర్ కూ పడుతుందని వ్యాఖ్యానించారు.
కూట్లె రాయి తీయలేనోడు ఏట్లె రాయి తీయడానికి పోయినట్టు.. తెలంగాణ రాష్ట్రంలోని సమస్యలను గాలికి వదిలేసి.. దేశ రాజకీయాలను మారుస్తానంటూ వెళ్లడం హాస్యాస్పదంగా ఉందని విమర్శించారు. ఈ ప్రాంత ప్రజల ఆశీర్వాదం పొంది.. అధికార మధంతో అదే ప్రజలను గంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు ఈటల రాజేందర్.