రాష్ట్రంలో సమృద్ధిగా నీరు, కరెంటు ఉందన్న సీఎం కేసీఆర్.. ఇప్పుడు పంట కొనబోమని జూటామాటలతో ప్రజలను మోసం చేస్తున్నారని మండిపడ్డారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్. శుక్రవారం హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్ విధానాల వల్ల ఇప్పుడు రాష్ట్రంలో రైతు నష్టపోతున్నాడన్నారని ఆందోళన వ్యక్తం చేశారు. తెలంగాణలో రోజు రోజుకు కరెంటు కోతలు పెరిగిపోతున్నాయని మండిపడ్డారు.
ఇతర రాష్ట్రాల్లో ఎంఎస్‌పీ కంటే ఎక్కువ ధరలు చెల్లించి రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేస్తున్నారని వివరించారు. కానీ.. మన రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేకుండా పోయిందన్నారు. వరి ధాన్యం వచ్చే అవకాశం ఉందని తెలిసి కూడా రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ఎలాంటి ఏర్పాట్లు చేయలేకపోయిందని ఆరోపించారు. తనకు నచ్చినట్టు వ్యవహరిస్తూ.. ఇష్టం వచ్చినట్టు పాలన సాగిస్తున్నారని ఆరోపించారు.
బీజేపీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తే రైతు పండించిన ప్రతి గింజ ధాన్యాన్ని కొనుగోలు చేస్తామన్నారు ఈటల. కేసీఆర్ అనాలోచిత నిర్ణయాల వల్ల కోటి ఎకరాలు పంట పండాల్సిన చోట పంటలు పండించలేని దుస్థితి ఏర్పడిందన్నారు. రైతుల నుంచి గింజవరకు వరి ధాన్యం కొనుగోలు చేసేందుకు కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతులకు క్షమాపణ చెప్పి సీఎం పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రాష్ట్రంలో కొత్తగా ఎలాంటి రైస్ మిల్లులను ఏర్పాటు చేయలేదన్నారు. గతంలో ఉన్న రైస్ మిల్లులే ఉన్నాయని పేర్కొన్నారు రాజేందర్. ఈ మిల్లులు పాత టెక్నాలజీతోనే నడుస్తున్నాయని గుర్తు చేశారు. కొన్ని రాష్ట్రాల్లోని రైసు మిల్లుల్లో గంటకు 150 టన్నుల వరి ధాన్యం బియ్యంగా మార్చుతున్నారని తెలిపారు. అంతేకాదు పంట చేల నుంచి నేరుగా ధాన్యాన్ని తమ మిల్లుల వద్దకు తీసుకెళ్లున్న రాష్ట్రాలు కూడా ఉన్నాయని రాజేందర్ గుర్తు చేశారు.