హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు ఫలక్‌నుమా ఏరియాలో 15 గుడ్లగూబలను రక్షించారు. వాటిని విక్రయించేందుకు యత్నిస్తున్న 22 ఏళ్ల కమ్రాన్ అలీ ఫరూక్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా ఆ గుడ్ల గూబలు ఆరోగ్యంగానే ఉన్నాయని, వాటిని నగరంలోని నెహ్రూ జూలాజికల్ పార్క్‌కు తరలించామని పోలీసులు తెలిపారు.
ఫలక్‌నుమాకు చెందిన కమ్రాన్ అలీ నగరంలోని పురాతన భవనాల్లో నివాసం ఉండే గుడ్ల గూబలను వలలు పన్ని పట్టుకునేవాడు. అనంతరం వాటిని ఒక్కొక్కటి రూ.10వేల నుంచి రూ.1 లక్ష వరకు విక్రయించేవాడు. అందులో భాగంగానే అతని వద్ద 15 గుడ్ల గూబలు ఉన్నాయని, వాటిని అతను విక్రయించేందుకు చూస్తున్నాడని తెలుసుకున్న టాస్క్ ఫోర్స్ పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం అతని నుంచి ఆ గుడ్ల గూబలను స్వాధీనం చేసుకున్నారు.
అయితే ఆ గుడ్ల గూబలను ఇతర రాష్ట్రాల వారికి అమ్ముతానని అలీ తెలిపాడు. వాటి సహాయంతో కొందరు క్షుద్ర పూజలు చేస్తారని అన్నాడు. అయితే వన్యప్రాణుల సంరక్షణ చట్టం 1972 షెడ్యూల్ 4 ప్రకారం ఆ జాతికి చెందిన గుడ్ల గూబలను వేటాడడం నేరం. అందుకు 3 ఏళ్ల జైలు శిక్ష లేదా రూ.23వేల జరిమానా లేదా కొన్ని సార్లు రెండూ విధిస్తారు. ఈ క్రమంలోనే కమ్రాన్ అలీపై అటవీ శాఖ అధికారులు ఆ చట్టం కింద కేసు నమోదు చేశారు. తదుపరి విచారణ నిమిత్తం అతన్ని టాస్క్ ఫోర్స్ పోలీసులు అటవీ శాఖ అధికారులకు అప్పగించారు. కాగా ఆ గుడ్ల గూబలను తిరిగి అడవిలో విడిచిపెట్టనున్నట్లు అధికారులు తెలిపారు.