రోడ్డు వెంట వెళ్తున్న సమయంలో కళ్ల ముందు ఏదైనా ప్రమాదం జరిగితే ప్రమాదంలో గాయపడిన వారిని ఎలా రక్షించాలని ఆలోచిస్తాం. కానీ.. అందులో కూడా లాభాన్ని వెతుక్కునే వారు ఉన్నరనడానికి ఈ ఘటన ఓ నిదర్శనం అని చెప్పొచ్చు. శుక్రవారం అర్ధరాత్రి జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో అది రుజువు అయింది.
కరీంనగర్-నిజామాబాద్ ప్రధాన రహదారిపై జగిత్యాలకి వెళ్లే మార్గంలో గంగాధర పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ముందుగా డీసీఎం, సిమెంటు లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో కోడిగుడ్లను తరలిస్తున్న డీసీఎం బోల్తాపడింది. అదే క్రమంలో వెనకాలే వస్తున్న మరో రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో డీసీఎం డ్రైవర్ తీవ్రంగా గాయపడగా.. అందులో ఉన్న కోడిగుడ్లు నేలపాలయ్యాయి. ఆ సమయంలో అటుగా వెళ్తున్న వాహనదారులు.. ప్రమాదాన్ని గమనించి అంబులెన్స్‌కు సమాచారం అందించి డ్రైవర్ ను ఆసుపత్రికి తరలించారు.
కాసేపటికి తెల్లవారింది. పనుల నిమిత్తం రోడ్డుపైకి వచ్చిన స్థానికులు.. రోడ్డుపై కోడిగుడ్ల వాహనం బోల్తా పడి ఉండటం చూశారు. వారు వెళ్తున్న పనులను పక్కకు పెట్టి.. ఒక్కసారిగా లోడ్ ఖాళీ చేసే పనిలో పడ్డారు. వారి వారి కుటుంబీకులకు సమాచారం అందించి అందినకాడికి ట్రేలలో గుడ్లను నింపుకెళ్లారు. మరికొందరయితే ఇంటి నుంచి బకెట్లు తీసుకొచ్చి మరీ గుడ్లు తీసుకెళ్లారు.
పిల్లలు, పెద్దలందరూ గుడ్లను ఏరే పనిలోనే నిమగ్నమయ్యారు. అంతేకాకుండా రోడ్డుపై పడిపోయిన ట్రేలపైకి ఎక్కి.. వాహనంలో ఇంకా ఏమైనా ఉన్నాయేమో అని చూసి మరీ తీసుకెళ్లారు. అలా క్షణాల్లోనే లోడ్ ఖాళీ చేశారు. వాహనం బోల్తాపడటంతో వాటి యజమానికి ఎంత నష్టం వాటిల్లందనే సంగతి వారెవరూ ఆలోచించకుండా వారి ప్రయోజనాలకోసం ఆరాటపడ్డారు. మొత్తానికి పోలీసులొచ్చే సరికి పగిలిన గుడ్లు తప్ప.. పగలకుండా ఉన్న ఏ ఒక్క గుడ్డూ కనిపించకుండా చేశారు. ఇటీవల హైదరాబాద్ శివారులో సైతం ఇలాగే ఓ కూల్‌డ్రింక్స్ వాహనం బోల్తా పడితే.. ట్రేలతో సహా ఎత్తుకెళ్లిపోయారు.