చత్తీస్ గఢ్ లోని అత్యంత వెనుకబడిన ప్రాంతమైన బస్తర్ లో ఓ ఎనిమిదేళ్ల బాలిక అరుదైన వ్యాధితో బాధపడుతోంది. ఆమె చర్మం మొత్తం చెట్టు బెరడు లాగా తయారైంది. ఈ అరుదైన వ్యాధిని ట్రీమ్యాన్ సిండ్రోమ్ గా పిలుస్తారు. ఇది ఛత్తీస్ గఢ్ లో నమోదైన మొట్ట మొదటి కేసు.
పూజ అనే అమ్మాయి పుట్టిన ఏడాది తర్వాత నుంచే ఈ వ్యాధి మొదలైంది. ముందుగా పూజ ఎడమ కాలికి ఒక పులిపిరి అయ్యిందని…అది మెల్లగా రెండు కాళ్లకు వ్యాపించిందని వ్యవసాయ కూలీ చేసుకొనే పూజ తండ్రి తెలిపాడు. రాను రాను అది భుజాలు, మెడ వరకు వ్యాపించి నొప్పి లేస్తూ ఆ అమ్మాయి కదలకుండా చేసింది. ఆ బాలికకు పరీక్షలు నిర్వహించగా అది ఎపిడర్మోడిస్ ప్లాసియా వెరుసిఫార్మిస్ గా తేలిందని డాక్టర్లు చెప్పారు. మెడికల్ జర్నల్స్ ప్రకారం ఇది అత్యంత అరుదుగా వచ్చే వంశపారంపర్య చర్మ వ్యాది. దీనితో స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. సహజంగా ఏడాది నుంచి 20 ఏళ్ల లోపు వాళ్లలో ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా కేవలం 200 మందికి మాత్రమే ఈ వ్యాధి సోకినట్టు అంచనా. దీనికి ఇప్పటి వరకు ఎలాంటి మందుల్లేవు.
పూజది బస్తర్ అటవీ ప్రాంతమైన దంతేవాడ జిల్లాలో ఉన్న టుమ్రీ గుండా. కొండ ప్రాంతం. ఇంద్రావతి నది ఒడ్డున ఉండే ఓ గూడెం. ఈ గూడేనికి బయటి ప్రపంచంతో సంబంధాలు తక్కువ. వర్షాకాలంలో నదులు ప్రవహిస్తుండడంతో బయటి ప్రపంచంతో సంబంధాలు కట్. గ్రామంలో ప్రాధమిక వైద్య సౌకర్యాలు లేవు. టుమ్రీ గూండాకు సమీపంలోని పహూర్ నర్ లో నిర్వహించిన మెడికల్ క్యాంపులో చూపించే వరకు ఆ అమ్మాయికి ఏమైందో తల్లిదండ్రులకు తెలియదు. అక్కడ ఆమె పరిస్థితిని గమనించిన డాక్టర్లు దంతేవాడ జిల్లా కేంద్రంలోని హాస్పిటల్ కు తీసుకురమన్నారు. అయితే వారు వెళ్లలేదు. ఆమె పరిస్థితిని తీవ్రతను తెలుసుకొని తామే అక్కడికి చేరుకొని చికిత్స ప్రారంభించామని మెడికల్ సూపర్ వైజర్ డాక్టర్ డీసీ శాండల్య తెలిపారు.
జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆ అమ్మాయికి వైద్య సహాయం అందిస్తున్నారు. అయితే ఇటీవల కొన్ని పత్రికల్లో ఆ అమ్మాయి గురించి రాసిన వార్తను చూసి రాష్ట్ర వైద్య శాఖ మంత్రి టీఎస్ సింగ్ స్పందించారు. అమ్మాయి వైద్యానికి కావాల్సిన ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని చెప్పారు. మంచి డాక్టర్లతో చికిత్స చేయిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. దీంతో పూజను రాష్ట్ర రాజధాని రాయ్ పూర్ కు తరలించిప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స చేయిస్తున్నారు. అయితే ఈ వ్యాధి నయమవుతుందో లేదో తెలియదు…కానీ మా డాక్టర్ల బృందం సాధ్యమైనంత వరకు వ్యాధి తీవ్రతను తగ్గించే ప్రయత్నం చేస్తున్నారని డాక్టర్ మృత్యుంజయ్ సింగ్ తెలిపారు.