హైదరాబాద్ ఎనిమిదో నిజాం ముకరంజా బహదూర్ ఇక లేరు. శనివారం రాత్రి 10.30 గంటలకు టర్కీలోని ఇస్తాంబుల్‌లో తుదిశ్వాస విడిచారు. ఆయన కుటుంబం తరపున హైదరాబాద్ లోని ఆయన కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటనను జారీ చేసింది.
హైదరాబాద్ చిట్టచివరి నిజాం రాజు మిర్ ఉస్మాన్ అలీ ఖాన్ బహదూర్ కు ముకరంజా మనుమడు అవుతాడు. ముకరం జా అసలు పేరు మిర్ బర్కత్ అలీ ఖాన్.
ఆయన కోరిక మేరకు అంత్యక్రియలను హైదరాబాద్ లోని అసఫ్ జాహీ ఫ్యామిలీ టూంబ్స్ లో నిర్వహించనున్నట్లు తెలిపింది. దీనికి సంబంధించిన షెడ్యూలును విడుదల చేస్తామని తెలిపింది.
మిర్ హిమాయత్ అలీ ఖాన్ వురపు అజం జా బహదూర్, ప్రిన్సెస్ డుర్రు షెవర్ దంపతులకు ముకరంజా జన్మించారు. ముకరంజా 1933 అక్టోబరు 6న జన్మించారు. ప్రిన్సెస్ డుర్రు షెవర్ టర్కీ చిట్ట చివరి సుల్తాన్ కుమార్తె. ఆమె దాదాపు 20 ఏళ్ళ క్రితం మరణించారు.