దేశంలోని మారుమూల ప్రాంతాల్లో గల ఆదివాసీలు, గిరిజన పిల్లల కోసం..ముఖ్యంగా మూడున్నర లక్షల మంది గిరిజన విద్యార్థులకోసం 740 ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూళ్లను ప్రారంభిస్తున్నామని, ఇందుకోసం 38,800 మంది టీచర్ల నియామకానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తన బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు, ఇదే సమయంలో పిల్లలు, పేదలకు నేషనల్ డిజిటల్ లైబ్రరీని ఏర్పాటు చేస్తామని, వీటిలోని భాషల పుస్తకాలు లభిస్తాయని ఆమె చెప్పారు.
ప్రధానంగా విద్యార్థుల కోసం పంచాయతీ, వార్డు స్థాయిలో ఫిజికల్ లైబ్రరీలను ఏర్పాటు చేసేలా రాష్ట్రాలను ప్రోత్సహిస్తామన్నారు. జాతీయ డిజిటల్ లైబ్రరీకి అవసరమైన సదుపాయాలను ఆయా ప్రభుత్వాలు కల్పిస్తాయన్నారు. ఈ సందర్భంగా ఆమె.. ఎడ్యుకేషన్ పై గల నేషనల్ మిషన్ ని ప్రస్తావించారు. ఈ ప్రభుత్వం విద్యా రంగానికి అధిక ప్రాధాన్యమిస్తోందన్నారు.
నేషనల్ బుక్ ట్రస్ట్ వంటివాటికి అదనపు బాధ్యతలను అప్పగిస్తున్నామని ఆమె చెప్పారు. ఇక ఆర్ధిక లోటును వచ్చే ఆర్ధిక సంవత్సరానికి 4.5 శాతానికకన్నా తక్కువ శాతానికి తగ్గించగలమన్న విశ్వాసాన్ని ఆమె వ్యక్తం చేశారు.
వర్తమాన ఆర్ధిక సంవత్సరానికి గాను సవరించిన అంచనా 6.4 శాతం ఉందన్నారు. సీనియర్ సిటిజన్లకు గరిష్ట డిపాజిట్ పరిమితిని 15 లక్షల నుంచి 30 లక్షలకు పెంచుతున్నామని, జాయింట్ అకౌంట్స్ నెలవారీ ఆదాయ పథకం పరిమితిని 9 లక్షలు, 15 లక్షలకు రెట్టింపు చేస్తున్నామన్నారు.