తండ్రి ఆస్తి పంచివ్వలేదని..కొడుకు తలకొరివి పెట్టేందుకు నిరాకరించిన ఘటన మరువక ముందే మానవ సంబంధాలను పాతరేసే మరో సంఘటన చోటుచేసుకుంది. అక్రమంగా ఆస్తి రాయించుకుని కన్నతండ్రిని వీధిపాలు చేసింది ఓ కఠినాత్మురాలైన కూతురు.
వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం గ్రామానికి చెందిన చాగంటి రామయ్య-లక్ష్మీ దంపతులకు రేణుక ఒక్క గానొక్క కూతురు. కొడుకులు లేరనే దిగులు లేకుండా..ఎంతో గారాబంగా పెంచుకున్నారు. కడవరకు అండగా ఉంటుందని ఆమె మీదే ఆశలు పెట్టుకున్నారు. కానీ ఆ కూతురు కేవలం తండ్రి పేరిట ఉన్న ఆస్తిపైనే ప్రేమ పెంచుకున్నది. కన్న తండ్రికి తెలియకుండానే భూమి మార్పిడి చేయించుకుని దిక్కులేనివాడిలా రోడ్డుపై వదిలేసింది. ఇప్పుడా నిర్భాగ్యుడు ఓ రావిచెట్టు నీడలో తలదాచుకుంటున్నాడు.
ఎవరైనా ఓ ముద్దపెడితే తిందామని కళ్ళల్లో ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాడు. కూతురు మీద బెంగతో ఆమె చేసిన నమ్మక ద్రోహంతో కుదేలైన ఆ తండ్రి..ఇప్పుడు అనారోగ్యంతో తల్లడిల్లుతున్నాడు. రామయ్య-లక్ష్మి దంపతులు కూతురు రేణుకను, తల్లంపాడు గ్రామానికి చెందిన ఎడ్లపల్లి మధుకిచ్చి వివాహం చేశారు. వారు హైదరాబాద్ లో ఉంటున్నారు. ఈ క్రమంలో రామయ్య భార్య లక్ష్మి మరణించింది. అతను దమ్మాయిగూడెం గ్రామంలో ఒంటరిగా ఉంటున్నాడు.
కూతురు రేణుక తండ్రి పేరిట ఉన్న ఆస్తిపై కన్నేసింది. ఎలాగైనా అతని పేరున ఉన్న సుమారు కోటి రూపాయలు విలువైన రెండెకరాల భూమిని తన పేరున మార్చుకోవాలనే ప్లాన్ వేసింది.అందులో భాగంగానే తండ్రి రామయ్యతో నమ్మబలికి హైదరాబాద్ తీసుకెళ్లింది. తల్లంపాడు గ్రామానికి చెందిన ఓవ్యక్తి సాయంతో 2018లో వచ్చిన ధరణి పోర్టల్ ద్వారా తండ్రికి తెలియకుండానే భూమి మార్పిడి చేయించుకుంది. భూమి చేతికి రావడంతో తండ్రి తనకు భారమయ్యాడు. ఎలాగైనా వదిలించుకోవాలనుకుంది. బయటకు వెళ్దామంటూ హైదరాబాద్ నుంచి ఖమ్మం తీసుకొచ్చి, ఖమ్మం శివారు ఓ ఆశ్రమంలో చేర్పించి చేతులు దులిపేసుకున్నారు.
ఇదిలా ఉంటే కొద్ది రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు దమ్మాయిగూడెం స్టేజిలో హైవేపై రామయ్యను దించేసి వెళ్లిపోయారు. దీంతో అప్పటినుంచి దిక్కుతోచని స్థితిలో పక్కనే ఉన్న రామ మందిరం వద్దకు చేరుకుని, ఎదురుగా ఉన్న రావి చెట్టుకింద ఉంటున్నాడు. హోటల్ నిర్వాహకులు, సమీప స్థానికులు తలో ముద్ద పెడితే తింటున్నాడు. పుట్టెడు దుఃఖంలో ఉన్న రామయ్యకు ఆస్తమా వ్యాధి సోకింది. ప్రస్తుత వాతావరణానికి అతని ఆరోగ్యం రోజురోజుకూ క్షీణిస్తున్నదని అక్కడున్నవారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బంధువులున్నా గతంలో జరిగిన భూతగాదాలతో వారెవ్వరూ రామయ్యను చేరదీయడం లేదని, ఆఖరి రోజుల్లో తోడుండాల్సిన వాళ్ళు నడిరోడ్డుపై వదిలేశారని అక్కడివారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దాతలు స్పందించి ఆదుకోవాలని కోరుతున్నారు.