ఆస్పత్రిలో మరణించిన తమ కుమారుడి మృతదేహాన్ని ఇంటికి తీసుకు వచ్చేందుకు వెళ్లిన తల్లిదండ్రులకు చేదు అనుభవం ఎదురైంది. రూ. 50వేలు చెల్లించాకే మీ కుమారుడి మృత దేహాన్ని అప్పగిస్తామని తెగేసి చెప్పాడు ఆ ఆస్పత్రి ఉద్యోగి.
దీంతో రూ. 50వేలు చెల్లించేందుకు గాను ఆ వృద్ధ దంపతులు బిక్షాటన చేస్తున్నారు. ఈ ఘటన బిహార్ లో చోటు చేసుకుంది. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఘటన వివరాల్లోకి వెళితే…..
మహేశ్ ఠాకూర్ కుమారుడు కొన్ని నెలల క్రితం తప్పిపోయాడు. దీంతో అతని కోసం మహేశ్ ఠాకూర్, ఆయన భార్య చాలా చోట్ల గాలించారు. అయితే ఫలితం లేకుండా పోయింది.
కానీ మీ కుమారుడు చనిపోయాడు … అతని మృత దేహం మా వద్దే ఉందంటూ సమస్తిపూర్ లోని ప్రభుత్వ ఆస్పత్రి నుంచి మహేశ్ కు ఫోన్ వచ్చింది. దీంతో వారు రోదిస్తూ ఆస్పత్రికి వెళ్లారు.
మీ కుమారుడి మృతదేహాన్ని అప్పగించాలంటే రూ. 50వేలు చెల్లించాలని ఆ ఆస్పత్రి ఉద్యోగి డిమాండ్ చేశాడు. అసలే నిరుపేదలు, ఆ పై వృద్ధులు కావడంతో డబ్బు చెల్లించడం వారికి ఇబ్బందిగా మారింది.
దీంతో తమ కొడుకు మృత దేహాన్ని విడిపించుకునేందుకు గాను ఇంటింటికి తిరిగి అందరిని యాచిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు వైరల్ కావడంతో ప్రభుత్వాస్పత్రి సివిల్ సర్జన్ ఎస్.కే. చౌదరి స్పందించారు.
ఈ విషయం ఇప్పుడే తమ దృష్టికి వచ్చిందన్నారు. ఘటనకు బాధ్యులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు. అయితే ఈ ఆస్పత్రిలో ఎక్కువగా కాంట్రాక్టు వర్కర్లు ఉన్నారని, వారికి గత కొన్ని నెలలుగా జీతాలు రావడం లేదని సమాచారం. అందుకే ఇలా మృతుల బంధువుల నుంచి డబ్బులు అడుగుతున్నట్టు తెలుస్తోంది.