ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ పేరుతో నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రను అడ్డుకునేందుకు పోలీసులు యత్నిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య. ఈ మేరకు ఆయన రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారిని కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. ఎలెక్షన్ కోడ్ అంటూ టీడీపీ బ్యానర్లు, ఫ్లెక్సీలను పోలీసులు తొలగిస్తున్నారని మండిపడ్డారు. స్థానిక టీడీపీ నేతలు చేస్తున్న ఏర్పాట్లపై నిరంకుశంగా వ్యవహరిస్తూ అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని ఫైర్ అయ్యారు.
పాదయాత్రలో ప్రదర్శిస్తున్న టీడీపీ జెండాలు, ఫ్లెక్సీలకు ఎన్నికల నియమావళి వర్తించదని తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పార్టీలు, పార్టీ గుర్తులతో సంబంధం లేకుండా జరుగుతాయన్నారు. పాదయాత్రకు సంబంధించి టీడీపీ జెండాలు, బ్యానర్లను తొలగిస్తూ అడ్డంకులు సృష్టించకుండా రాష్ట్ర పోలీసులను ఆదేశించాలని కోరుతూ సీఈసీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు వర్ల రామయ్య.
కాగా శుక్రవారం ఉదయం సత్యవేడు నియోజకవర్గం పరిధిలోని బైరాజు కండ్రిగ విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్రను ప్రారంభించారు. లోకేష్ కు స్వాగతం పలికేందుకు పెద్దఎత్తున టీడీపీ శ్రేణులు, అభిమానులు అక్కడకు తరలివచ్చారు.
అయితే శ్రీకాళహస్తిలో పాదయాత్రను జరగకుండా చూసేందుకు పోలీసులు, ప్రభుత్వం అనేక రకాల నిబంధనలు విధిస్తూ ఇబ్బందులకు గురిచేస్తున్నారు. శ్రీకాళహస్తిలో టీడీపీ శ్రేణులు ఇచ్చిన పాదయాత్ర రూట్‌మ్యాప్ ను పోలీసులు నిరాకరించారు. తాము చెప్పిన మార్గంలోనే పాదయాత్ర చేసుకోవాలని పోలీసులు మౌకిక ఆదేశాలు జారీ చేశారు.