ఓటింగ్ ప్రక్రియలో వినూత్న విధానానికి ఎన్నికల సంఘం తెరలేపనుంది.ఉపాధి నిమిత్తం దేశంలోని వివిధ నగరాలకు వెళ్లే వలస కార్మికులు.. తమ సొంత నియోజకవర్గంలో రిమోట్‌గా ఓటు వేసేందుకు కొత్త విధానాన్ని తయారు చేసింది. ఇందుకు సహాయపడే రిమోట్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ పరికరాన్ని అభివృద్ధి చేసినట్లు ఎన్నికల సంఘం గురువారం తెలిపింది.
ఈ పరికరం దేశంలో ఎక్కడి నుంచైనా, ఎవరైనా తమ నియోజకవర్గానికి ఓటు వేయడానికి వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా సెలవు దొరక్క, ప్రయాణ ఖర్చుల గురించి ఆలోచించి ఓటు వేయడానికి సొంత రాష్ట్రానికి వెళ్లలేని ఓటర్లకు పెద్ద ఉపశమనం ఇవ్వనుంది.
ఈ పరికరాన్ని ప్రదర్శించి, వివరించేందుకు జనవరి 16న రాజకీయ పార్టీలను ఈసీ ఆహ్వానించింది. యంత్రాన్ని అమలు చేయడంలో ఎదుర్కొనే చట్టపరమైన, కార్యాచరణ, పరిపాలనా, సాంకేతిక సవాళ్లపై పార్టీల అభిప్రాయాలను పొందడం కోసం దీనిని ప్రదర్శించనుంది.
” 2019 సార్వత్రిక ఎన్నికల్లో 67.4 శాతం పోలింగ్ నమోదైంది. దాదాపు 30 కోట్ల మందికి పైగా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోకపోవడం ఆందోళనకరం. ఓటరు తన కొత్త నివాస ప్రాంతంలో ఓటు నమోదు చేసుకోకపోవడానికి అనేక కారణాలు ఉన్నాయి. దీంతో చాలా మంది ఎన్నికల్లో ఓటు వేయలేకపోతున్నారు. అంతర్గత వలసల కారణంగా ఓటు వేయలేకపోవడం ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్య, ఉద్యోగం, పెళ్లి ఇలా అనేక కారణాలతో చాలా మంది స్వస్థలాలను వదిలివెళ్తున్నారు. దేశంలో దాదాపు 85 శాతం మంది ఇలాంటి వారే. ఇలా వలసలు వెళ్లినవారు కూడా ఓటు హక్కును వినియోగించుకునేందుకే ఈ రిమోట్ ఓటింగ్‌పై దృష్టిపెట్టాం. ”
-రాజీవ్ కుమార్, ప్రధాన ఎన్నికల అధికారి