తెలంగాణలో హుజురాబాద్ ఉప ఎన్నిక రాజకీయం రసవత్తరంగా మారింది. ఇటు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు అటు మాజీ మంత్రి ఈటల రాజేందర్‌కు అత్యంత ప్రతిష్టాత్మకంగా మారడంతో ప్రతి పరిణామాన్ని రాష్ట్రమంతా ఆసక్తికరంగా గమనిస్తోంది. ఎప్పుడు ఎన్నిక వచ్చినా సిద్ధంగా ఉండేందుకు ఈటల, కేసీఆర్ సర్వ శక్తులు ఒడ్డుతున్నారు. కేసీఆర్ అయితే హుజురాబాద్ ఉప ఎన్నిక కోసమే దళిత బంధు పథకాన్ని తెరమీదకు తెచ్చారు. ఇక క్యాబినెట్ మొత్తం ఇప్పటికే హుజురాబాద్‌లోనే తిష్టవేసి.. రెండు, మూడు దఫాలు నియోజకవర్గాన్ని చుట్టేసింది కూడా. ఈక్రమంలోనే ఈ నెలలో ఉప ఎన్నిక నోటిఫికేషన్ పక్కా అని సంకేతాలు ఆగస్టు 16న హుజురాబాద్‌లో ప్రారంభించాల్సిన దళిత బంధు పథకాన్ని ఉన్నపళంగా వాసాలమర్రిలో అమలు చేశారు కేసీఆర్. పార్టీ ట్రబుల్ షూటర్ హరీష్ రావును హుజురాబాద్ పంపించారు. ఈ పరిణామాలన్నింటిని చూస్తున్నవారు అతి త్వరలోనే ఉప ఎన్నిక పక్కా ఫిక్స్ అయిపోయారు. కానీ ఉన్నట్టుండి ఊహించని ట్విస్ట్ ఇచ్చింది కేంద్రం ఎన్నికల సంఘం.
త్వరలోనే హుజురాబాద్ ఉప ఎన్నిక అని ఆశలుపెట్టుకున్న పార్టీలపై సీఈసీ నీళ్లు చల్లింది. ఈ నెలలో ఉప ఎన్నిక నిర్వహించడం లేదనే సంకేతాలను పంపింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిర్వహించే ఉప ఎన్నికలతో పాటు 5 రాష్ట్రాల ఎన్నికల నిర్వహణకు సంబంధించి ఆయా రాష్ట్రాల రాజకీయ పార్టీలకు సీఈసీ లేఖలు రాసింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాలు చెప్పాలని కోరింది. ఈ నెల 30లోగా సమాధానం పంపాలని లేఖలో తెలిపింది. దీనితో హుజురాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ ఈ నెలలో వచ్చే అవకాశాలు లేవని స్పష్టమైంది.
గతంలో కరోనా సెకండ్ వెవ్ టైంలో బెంగాల్ సహా పలు రాష్ట్రాల ఎన్నికల నిర్వహించడంపై సీఈసీపై అనేక విమర్శలు వచ్చాయి. కోర్టులు కూడా చివాట్లు పెట్టాయి. మళ్లీ ఇప్పుడు అలాంటి సమస్య రాకుండా సీఈసీ ఇలా అన్ని పార్టీలకు లేఖలు రాసినట్లు తెలుస్తోంది. సీఈసీ ఇచ్చిన ఝలక్ తో TRS నేతలు డిఫెన్స్ లో పడినట్లు సమాచారం. మరో నెల పాటు క్యాడర్ ను కాపాడుకోవటంతో పాటు.. ఈటల వైపు తమ నేతలను వెళ్లకుండా ఎలా ఆపాలాని మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలుస్తోంది. ఇంకా ఎన్ని వరాలు కురిపించాలో.. అప్పటివరకు పరిస్థితులు ఎలా ఉంటాయోనని కలవరపడుతోంది. మొత్తం మీద ఇక సమరమే అనుకున్న సమయంలో ఈసీ నిర్ణయం పార్టీలకు, ముఖ్యంగా టీఆర్ఎస్‌కు శరాఘాతంగా మారిందని రాజకీయ విశ్లేషకులు చెప్పుకుంటున్నారు.