తెలంగాణ నుంచి ఖాళీగా ఉన్న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక నిర్వహించేందుకు నోటిఫికేషన్ వెలువడింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ స్టార్ట్ అయిపోయింది. ఈనెల 19వ తేదీ వరకు నామినేషన్లకు అవకాశం ఉంటుంది. అసెంబ్లీ ప్రాంగణంలో ఇందుకోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు.
ఈనెల 20న నామినేషన్ల పరిశీలన ఉండగా.. 30న పోలింగ్ నిర్వహించనున్నారు. 30న ఉదయం 9 నుంచి సాయంత్రం 4 వరకు పోలింగ్ జరిపి.. సాయంత్రం 5 నుంచి ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి ఉపఎన్నిక నిర్వహిస్తోంది ఈసీ.
ఈ స్థానంలో ఎన్నికయ్యే అభ్యర్థి పదవీ కాలం 2024 ఏప్రిల్ 2తో ముగుస్తుంది. బండా ప్రకాశ్ ఇటీవల ఎమ్మెల్సీగా ఎన్నికవడంతో రాజ్యసభ పదవికి రాజీనామా చేశారు. బండ ప్రకాష్ రాజీనామాతో ఖాళీ అయిన ఈ స్థానానికి తాజాగా నోటిఫికేషన్ విడుదల చేసింది ఎన్నికల కమిషన్.
ఈ రాజ్యసభ స్థానాన్ని అధికార టీఆర్‌ఎస్ కైవసం చేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. గులాబీ పార్టీకి అసెంబ్లీలో వందకుపైగా ఎమ్మెల్యేలున్నారు.