ఈశాన్య రాష్ట్రం మణిపూర్ లో అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి తొలిదశ పోలింగ్ సోమవారం ప్రారంభమైంది. ఉదయం 7 గంటలకు ఆరంభమైన పోలింగ్ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. మణిపూర్ అసెంబ్లీలో మొత్తం 60 స్థానాలు ఉండగా.. తొలి దశలో ఐదు జిల్లాల పరిధిలోని 38 నియోజకవర్గాలకు ఎన్నికలు జరుగుతున్నాయి.
వాస్తవానికి ఈ ఎన్నికలు యూపీ ఐదో విడత ఎన్నికలతో పాటు ఆదివారమే జరగాల్సి ఉంది. అయితే.. పోలింగ్ ఏర్పాట్లలో ఆలస్యం కారణంగా ఇవాళ్టికి వాయిదా వేశారు అధికారులు. తొలివిడతలోని 38 అసెంబ్లీ సెగ్మెంట్లలో మొత్తం 1,721 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేసినట్టు ఈసీ వెల్లడించింది. మొత్తం 173 మంది అభ్యర్థులు పోటీచేస్తుండగా.. వారిలో కేవలం 15 మంది మాత్రమే మహిళా అభ్యర్థులు ఉన్నారు.
సీఎం బీరేన్ సింగ్ తో పాటు.. ఉపముఖ్యమంత్రి జాయ్కుమార్ సింగ్, స్పీకర్ వై. కేమ్చంద్ సింగ్, రాష్ట్ర కాంగ్రెస్ చీఫ్ లోకేశ్ సింగ్ బరిలో ఉన్న స్థానాలు సైతం తొలివిడత పోలింగ్ లోనే ఉండటం విశేషం. ఈ నేపథ్యంలో సీఎం బీరేన్ సింగ్ ఇంఫాల్ లోని తన నివాసంలో భార్యతో కలిసి ప్రత్యేక పూజలు చేశారు. తర్వాత కుటుంబ సమేతంగా శివం హైస్కూలులోని బూత్ కు వెళ్లి ఓటు వేశారు.
మణిపూర్ లో మరోసారి బీజేపీనే ప్రజలు ఆశీర్వదిస్తారని సీఎం బీరేన్ సింగ్ ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో మిగిలిన 22 అసెంబ్లీ స్థానాలకు మార్చి 5న రెండో విడత పోలింగ్ జరుగనుంది. మార్చి 10న ఎన్నికల తుది ఫలితాలు వెలువడనున్నాయి.