ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఐదో దశ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ నేడు జరిగింది. 61 సీట్ల కోసం 692 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద్ మౌర్య సహా పలువురు ప్రముఖులు కూడా పోటీలో ఉన్నారు. మరోవైపు మిగితా రెండు దశల పోలింగ్ కోసం వివిధ పార్టీల నేతలు ఎన్నికల ప్రచారం నిర్వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల ముందు బీజేపీని వీడీ సమాజ్‌వాదీ పార్టీలో చేరిన ఓబీసీ నేత స్వామి ప్రసాద్ మౌర్యపై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ ప్రశంసల వర్షం కురిపించారు. స్వామి ప్రసాద్ మౌర్య ఐదేళ్ల క్రితమే ఎస్పీలో చేరాల్సి ఉందని అన్నారు. మార్చి 3న ఎన్నికలు జరగనున్న ఫజిల్ నగర్ నియోజకవర్గం నుండి ప్రసాద్ మౌర్య పోటీ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అఖిలేష్ యాదవ్ ఆయన తరపున ప్రచారం నిర్వహించారు.
స్వామి ప్రసాద్ మౌర్య ఎస్పీలో చేరిన తర్వాత బీజేపీలో కలవరం మొదలైందన్నారు అఖిలేష్ యాదవ్. ప్రసాద్ మౌర్య తమ పార్టీలో చేరతారని 2011 నుంచి ఎదురుచూస్తున్నామని చెప్పారు. బీఎస్పీని వీడి తర్వాత మళ్లీ తమ పార్టీలోకి వస్తారని ఎదురుచూశామన్నారు. కానీ.. ఇప్పుడు ఆయన ఎస్పీలో చేరాడం ఆనందంగా ఉందన్నారు. దీంతో ఎస్పీకి మరింత బలం వచ్చిందన్నారు అఖిలేష్. విధానసభలో అధికార పక్షంలో కూర్చున్నప్పటికీ.. ఆయన ప్రతిపక్షం వాదనలు వినిపించేవారని మౌర్యపై ప్రశంసలు కురిపించారు.
ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా ఆయన తమకు దూరం కాలేదని చెప్పారు. కాగా.. స్వామి ప్రసాద్ మౌర్యకు ఆరోసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు గట్టి సవాలు ఎదురవుతోందన్నారు. ఎందుకంటే.. మాజీ కేంద్ర మంత్రి, ప్రముఖ ఓబీసీ నాయకుడు ఆర్పీఎన్ సింగ్ ను బీజేపీ బరిలో నిలిపింది. మౌర్య తన నియోజకవర్గాన్ని పద్రౌనా నుంచి ఖుషినగర్ జిల్లాలోని ఫాజిల్ నగర్ కు మార్చారు. అయితే.. 2017లో బీజేపీకి చెందిన గంగా సింగ్ కుష్వాహా గెలుపొందిన ఫాజిల్ నగర్ లో ఆయనకు ఎన్నికల పోరు అంత సులువు కాదని అభిప్రాయపడ్డారు. ఈ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిగా మనోజ్ కుమార్ సింగ్ బరిలోకి దిగుతున్నారని అన్నారు. బహుజన్ సమాజ్ పార్టీ అభ్యర్థి ఇలియాస్ అన్సారీ ఇటీవలే సమాజ్‌వాదీ పార్టీని వీడారు.
రాజకీయ పార్టీల అంచనాల ప్రకారం.. ఫాజిల్ నగర్ అసెంబ్లీ సెగ్మెంట్ లో దాదాపు 90,000 మంది ముస్లిం ఓటర్లు, 55,000 మౌర్య కుష్వాహలు, 50,000 యాదవులు, 30,000 బ్రాహ్మణులు, 40,000 కుర్మీ-సాయింత్వార్ లు, 30,000 మంది దళితులు, 80 వేల మంది వైశ్యులు ఉన్నారు. బీఎస్పీ ఇలియాస్ అన్సారీ తన సాంప్రదాయ ఓటు బ్యాంక్ పై ఎస్పీ నుంచి ప్రయోజనాన్ని పొంది.. దాని ఎన్నికల ఆధిపత్య సంఘం ఓట్లను చీల్చడానికి బెదిరించాడు. ముస్లిం ఓట్లు చీలిపోకుండా ఉండటంపై మౌర్యకు అవకాశాలు ఉన్నాయని రాజకీయ నిపుణులు భావిస్తున్నారు. బీజేపీ అభ్యర్థి సురేంద్ర సింగ్ కుష్వాహ తోటి కులస్థుడు కావడం.. ఆర్పీఎన్ సింగ్ అతనితో కుర్మీ-సాయింత్వార్ లను సమీకరించగలడు కాబట్టి.. యాదవులు, ముస్లింలు ఎలా ఓటు వేస్తారనే దానిపై మౌర్య గెలుపు ఆధారపడి ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.