ప్రతి నెల కరెంట్ బిల్ వస్తూనే ఉంటుంది. ఓ పది రూపాయలు అటూ ఇటుగా దాదాపు ఒకేలా వుంటుంది. రేకుల షెడ్ ఇంటికి అయితే ఎంతొస్తుంది….? మహా అయితే 500, లేదా 1000. పోనీ మరీ ఎక్కువ వాడితే ఓ రెండు వేలు. అంతే తప్ప 6 లక్షలైతే రాదు కదండీ. రాదంటే రాదు. కానీ, వచ్చిందండీ.. జిల్లా గోదావరిఖని సంజయ్ నగర్‌లో ఓ రేకుల షెడ్డు ఇంటికి వచ్చిన కరెంట్ బిల్ చూస్తే హార్ట్ ఎటాక్ వచ్చేంత పని అవుతుంది.
మొన్నటి ఆగస్ట్ నెలలో రాజయ్య అనే వ్యక్తి ఇంటికి వచ్చిన కరెంట్ బిల్ ఇప్పుడు జిల్లా వ్యాప్తంగానే కాదు, సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఏకంగా 6లక్షల 8వేల పైచిలుకు బిల్ రావటంతో ఒక్కసారిగా షాక్‌కు గురై, అధికారుల దగ్గరకు పరిగెత్తుకెళ్లాడు. కానీ ఏ ఒక్కరు సరిగ్గా స్పందించకపోవడంతో బాధితుడు తనకు న్యాయం కావాలని వేడుకుంటున్నారు.
కొంతకాలంగా రాష్ట్ర విద్యుత్ సంస్థలు అవలంబిస్తున్న విధానాలపై అన్ని వర్గాల్లోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ప్రతి నెల 30రోజుల లోపే వినియోగదారులకు విద్యుత్ బిల్లులు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎన్ని ఎక్కువ రోజులు గడిస్తే అంత వినియోగదారుల విద్యుత్ స్లాబులు మారుతాయి. దీంతో ప్రతి యూనిట్‌కు భారీ తేడా వస్తుంది. ఇది వినియోగదారులకు భారంగా, విద్యుత్ సంస్థలకు వరంగా మారింది. అందుకే 35 రోజులకు, 40 రోజులకు బిల్ ఇస్తున్నారు. ఇప్పటికే పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన విద్యుత్ సంస్థలు ఇలా కొంత భారాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నాయని, వీటికి ప్రభుత్వ పెద్దల సహకారం ఉందని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇక విద్యుత్ మీటర్లలో ఏదైనా తప్పులున్నా ఇలా భారీ బిల్లులు వస్తాయని, గట్టిగా అడిగే వారుంటేనే సరి చేస్తున్నారని, లేదా రాజయ్యలాగే ఆఫీసుల చుట్టూ తిప్పుతున్నారని బాధితులు మండిపడుతున్నారు.
దీనిపై మరోవాదన కూడా తెరపైకి వస్తోంది. ప్రభుత్వం, విద్యుత్ సంస్థలు ప్రీపెయిడ్ మీటర్లను ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నట్టు చెబుతున్నారు. ఇప్పటికే ప్రభుత్వ కార్యాలయాల్లో పైలట్ ప్రాజెక్టుగా టెస్టింగ్ కూడా నడుస్తోంది. ఈ ప్రీపెయిడ్ మీటర్లు పెడితే మీరు ఎంత రీఛార్జి చేస్తే అంతే వాడుకోవచ్చని, తద్వారా ఇలాంటివి అరికట్టవచ్చని విద్యుత్ సంస్థల్లో పనిచేసేవారు వాదిస్తున్నారు. కానీ దీని వల్ల విద్యుత్ సంస్థలకు భారీగా ముందస్తుగానే నిధులు సమీకరించుకునే అవకాశం ఏర్పడనుంది. ప్రభుత్వంపై భారం పడకుండా, ప్రజల నడ్డివిరిచే ప్రయత్నాలు అంటూ జనం, ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని చెప్పుకునే కేసీఆర్ సర్కార్ దీనిపై పునరాలోచించి, జనంపై భారం వేయ్యొద్దని కోరుతున్నాయి.