ధరల పెంపులో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పోటీ పడుతున్నట్లుగా కనిపిస్తోంది. ఓవైపు వంటగ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలతో సామాన్యుడికి కేంద్రం చుక్కలు చూపిస్తుండగా.. ఇంకోవైపు తామేమన్నా తక్కువా అన్నట్లు తెలంగాణ సర్కార్ కరెంట్ షాక్ ఇచ్చేందుకు సిద్ధమైంది.
14 శాతం విద్యుత్ ఛార్జీలను పెంచుకునేందుకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసింది. తాజా నిర్ణయంతో డొమెస్టిక్ వాడకంపై యూనిట్ కు 50 పైసలు పెరగనుంది. ఇతర కేటగిరీలకు యూనిట్ కు రూపాయి చొప్పున పెరుగుతుంది.
విద్యుత్ ఛార్జీలను 19 శాతం పెంచాలని డిస్కంలు ఈఆర్‌సీని కోరాయి. ఈ నేపథ్యంలోనే ఛార్జీల వడ్డనకు ఓకే చెప్పింది ఈఆర్‌సీ. ఈ మేరకు చైర్మన్ తన్నీరు రంగారావు మీడియాకు వివరాలు ప్రకటించారు. రూ.5,500 కోట్ల లోటు పూడ్చేందుకు కరెంట్ ఛార్జీలు పెంచుతున్నట్లు తెలిపారు.
దీనిపై తెలంగాణ సీఎం కేసీఆర్ ఫైనల్ నిర్ణయం తీసుకోనున్నారు. ఆయన 14 శాతం పెంపునకు గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఏప్రిల్ ఒకటి నుండి కరెంట్ చార్జీలు పెరుగుతాయి.
ఈ నిర్ణయంతో తెలంగాణలోని నిరుపేదలపై మరింత భారం పడుతుంది. ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధ ప్రభావంతో నూనె ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. అలాగే ఇతర నిత్యావసరాల ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ఇప్పుడు కరెంట్ ఛార్జీల పెంపు అదనపు భారం కానుంది.