వేసవి ఎండ తీవ్రత పెరగడంతో ఏపీలో విద్యుత్ వినియోగం గణనీయంగా పెరిగింది. కానీ, డిమాండ్‌కు సరిపడా విద్యుత్ అందుబాటులో లేదు. విద్యుత్ సరఫరా చేయడంలో విఫలమవుతున్న పంపిణీ సంస్థలు విద్యుత్ వినియోగంపై ఆంక్షలు విధిస్తున్నాయి. ఏపీలోనే కాదు.. దాదాపు దేశంలో 12 రాష్ట్రాల్లో ఇదే పరిస్థితి. పంజాబ్, హర్యానా, ఉత్తరాఖండ్, బీహార్, యూపీ, రాజస్థాన్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, జార్ఖండ్ రాష్ట్రాల్లో పరిశ్రమలకు వారంలో 2-3 రోజులు పవర్ హాలిడే ప్రకటించాయి విద్యుత్ పంపిణీ సంస్థలు.
ఇక తాజాగా.. ఇప్పుడు గృహ వినియోగదారులపై కూడా ఆంక్షలు విధించాయి పంపిణీ సంస్థలు. ఏసీల వాడకాన్ని తగ్గించాలని ఆంక్షలు పెట్టాయి. అలాగే నీటి మోటార్లను ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటలలోపు మాత్రమే వాడాలని, ఐఎస్ఐ మార్కు ఉన్న మోటార్లు, పంపులు వినియోగించాలని తెలిపాయి. అవసరమైతేనే లైట్లు ఉపయోగించాలని.. బయటకు వెళ్తే లైట్లను ఆఫ్ చేయాలని పేర్కొన్నాయి.
అలాగే, వస్త్ర దుకాణాలు, సూపర్ మార్కెట్లపై కూడా విద్యుత్ వినియోగ ఆంక్షలు ఉన్నాయి. వాటిలో 50 శాతం లైట్లను మాత్రమే వినియోగించాలని, విద్యుత్ సంక్షోభం తగ్గేంతవరకూ ఈ ఆంక్షలు కొనసాగుతాయని విద్యుత్ సంస్థలు పేర్కొన్నాయి. మరోవైపు ఏపీలో జగనన్న కాలనీల్లో నిర్మించిన ఇళ్లకు డిస్కంల ద్వారా ఉచిత విద్యుత్ అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
మొదటి దశలో 12,49,133 ఇళ్లకు విద్యుత్ ఇవ్వాలని తెలిపింది. దీనికి అవసరమైన నిధులను గృహ నిర్మాణ శాఖకు సమకూరుస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. అలాగే రూ.4600 కోట్ల ఆర్థిక సాయం అందించేందుకు పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, రూరల్ ఎలక్ట్రిసిటీ కార్పొరేషన్ అంగీకారం తెలిపాయి. అటు జగనన్న కాలనీలకు ఉచిత విద్యుత్ కోసం ప్రభుత్వం రూ.1217.17 కోట్లు ఖర్చు చేస్తోంది. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని ఐదు జిల్లాల్లో 2,813 లే అవుట్లు ఉంటే.. 5,16,188 ఇళ్లకు విద్యుత్ కనెక్షన్లను రూ.2,519 కోట్లతో అందిస్తున్నారు. ఏపీసీపీడీసీఎల్ పరిధిలోని మూడు జిల్లాలతో పాటు సీఆర్డీఏ పరిధిలో ఉండే 6 లక్షల ఇళ్లకు రూ.1,805 కోట్లతో విద్యుత్ ఇవ్వనున్నారు.