– రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి
– వినియోగంలో ఆల్ టైమ్ రికార్డ్
తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ కి డిమాండ్ బాగా పెరిగింది. తాజా గణాంకాలు చూస్తుంటే ఇది స్పష్టం అవుతోంది. రాష్ట్ర చరిత్రలోనే శనివారం విద్యుత్ వినియోగం రికార్డ్ స్థాయిలో జరిగింది. శనివారం మధ్యాహ్నం 12 గంటల సమయానికి 14వేల 649 మెగా వాట్ల డిమాండ్ నమోదు అయినట్లు విద్యుత్ శాఖ వెల్లడించింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత ఇంత విద్యుత్ వినియోగం నమోదు కావడం ఇదే మొదటిసారి అని అధికారులు స్పష్టం చేశారు.
శుక్రవారం సాయత్రం 4.08 గంటలకు 14,169 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదైంది. గత ఏడాది అదే రోజున 11,420 మెగావాట్ల విద్యుత్ డిమాండ్ నమోదు కాగా.. మే నెల వరకు 15,000 వరకు చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇంకా వేసవి మొదలుకాకముందే.. విద్యుత్తు వాడకం చుక్కలను తాకుతోంది. వచ్చే రోజుల్లో ఈ డిమాండ్ శిఖరాగ్రానికి చేరుతోందని విద్యుత్ పంపిణీ సంస్థలు అంచనా వేస్తున్నాయి.
గతంలో అత్యధిక రోజువారీ వినియోగం 2022 మార్చి 29న 14,167 మెగావాట్లు నమోదు కాగా.. శుక్రవారం ఆ రికార్డ్ బద్దలైంది. అయితే.. శనివారం అంతకంటే ఎక్కువ విద్యుత్ ను వాడకం జరిగింది. యాసంగి పంటల సాగు విస్తీర్ణం విపరీతంగా పెరగడంతో వ్యవసాయ బోరుబావుల వినియోగం పెరుగుతోందని అంటున్నారు. కొద్దిరోజులుగా బోర్లకు 10 గంటల్లో త్రీఫేజ్ కరెంట్ ఇస్తున్నారు. శుక్రవారం 12 గంటల నుంచి సరఫరా పెరగడంతో డిమాండ్ కూడా పెరుగుతోందని అంచనా వేస్తున్నారు.
ఈ సంవత్సరం వేసవి కాలంలో 15 వేల మెగా వాట్ల డిమాండ్ వచ్చే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. డిమాండ్ ఎంత వచ్చినా నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని విద్యుత్ అధికారులు చెబుతున్నారు. సాగు విస్తీర్ణం పెరగడం, రాష్ట్రంలో పారిశ్రామిక అవసరాలు పెరగడంతో విద్యుత్ వినియోగం రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఉన్నంత వరకు వ్యవసాయానికి 24 గంటల నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగుతుందని మంత్రి జగదీష్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేశారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందించడంలో రాజీ ప్రసక్తే లేదని ఆయన తేల్చి చెప్పారు.