తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ ఇస్తున్నామని చెబుతోంది. మరో వైపు అన్నదాతలు మాత్రం ఆరుగాలం కష్టపడి పండిస్తున్న పంటకు నీరు లేక కంటి ముందే ఎండిపోతుందని వాపోతున్నారు. కనీసం 9 గంటలు కూడా సరిగ్గా కరెంట్ ఇవ్వడం లేదని పోరాటానికి దిగుతున్న సందర్భాలు కనిపిస్తూనే ఉన్నాయి. మరి ఈ క్రమంలోనే అసలే పవర్ లేక నానా కష్టాలు పడుతున్న అన్నదాతలకు కరెంట్ బిల్లు కట్టమని ఇంటికి వచ్చిన విద్యుత్ అధికారులను చూస్తే.. ఆక్రోషం ముంచుకొచ్చింది. ఏం చేశారో చూడండి.
పంటలకు సరిపడా కరెంట్ ఇవ్వకుండా బిల్లులకు ఎలా వస్తారంటూ సంబంధిత విద్యుత్ అధికారులను బాధిత రైతులు గదిలో నిర్బంధించి నిరసన తెలిపారు. ఈ ఘటన నల్లబెల్లి మండలంలో చోటుచేసుకుంది. కొండైల్ పల్లి గ్రామంలో వ్యవసాయ బిల్లులకు స్థానిక విద్యుత్ అధికారులు వెళ్లారు. ఈ క్రమంలో వ్యవసాయానికి 24 గంటలు కరెంటు ఎందుకు ఇవ్వడం లేదంటూ బాధిత రైతులు నిలదీశారు.
రైతుల కోపానికి ఒక్క సారిగా షాక్ తిన్న విద్యుత్ అధికారులు వాళ్లకు సరైన సమాధానం ఇవ్వలేకపోయారు. అయితే సీఎం కేసీఆర్ ఏమో రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల ఉచిత విద్యుత్ అని పదే పదే చెబుతుంటే.. కనీసం 9 గంటలు కూడా సరిగ్గా కరెంట్ లేదని బాధిత రైతులు అధికారులను లెఫ్ట్ రైట్ తీసుకున్నారు. కరెంట్ లేకపోవడంతో పంటలకు సరిగ్గా నీరు అందక అవి ఎండి పోయి.. పడ్డ కష్టం అంతా వృద్ధా పోతుందని వారు అధికారులను నిలదీశారు. వారు సమాధానం చెప్పకపోవడంతో పంచాయతీ కార్యాలయంలో విద్యుత్ అధికారులను వేసి తాళం పెట్టి నిరసన తెలిపారు. ఈ నిరసన కార్యక్రమంలో బాధిత రైతులు లక్ష్మణ్ రెడ్డి, నరేష్ రెడ్డి, ముకుంద రెడ్డి తదితరులు పాల్గొన్నారు.