ఏనుగుల బీభత్సంతో శ్రీకాకుళం కొండ ప్రాంతాలు గజగజా వణికిపోతున్నాయి. ఏనుగులు గుంపు రాత్రి వేళ పంటలను నాశనం చేయడంతో రైతులు గగ్గోలు పెడుతున్నారు. ఈ సాయంత్రం సరుబుజ్జిలి మండలంలోని పలు ప్రాంతాల్లో ఏనుగులు గుంపు సంచరించినట్టు స్థానికులు చెబుతున్నారు. మతలబుపేట గ్రామ సమీపంలో నాలుగు ఏనుగులు వచ్చి స్థానికంగా సందడి చేశాయి. వర్షాకాలంలో ఇలా ఏనుగులు అటవీ ప్రాంతం నుంచి జనావాసాల్లోకి రావడం జరుగుతుంటుంది.
శ్రీకాకుళం జిల్లా ఎల్ఎన్ పేట మండలంలోని సూదిరాయిగూడ, కరకవలస కొండల్లో తిష్ట వేసిన నాలుగు ఏనుగుల గుంపు ఆయా ప్రాంతాల్లో హల్‌చల్ చేశాయి. ఈ ఏనుగుల గుంపు సూదిరాయిగూడ గ్రామం సమీపానికి వచ్చాయని గిరిజనులు చెప్పారు. వారం రోజులుగా ఏనుగులు గ్రామ సమీపానికి వచ్చి వెళ్లి పోతున్నాయని, ఏనుగులు వచ్చే సమయానికి విద్యుత్ సరఫరా లేకపోవడంతో ఏనుగులు గ్రామ వీధులోకి వచ్చాయని, అప్పుడు మంటలు వేసి ఏనుగుల్ని తరమాల్సి వచ్చిందని గిరిజనులు చెప్పారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించాలని సంబంధిత శాఖ సిబ్బందికి ఫోన్ చేసినా వారు స్పందించడం లేదని ఆరోపించారు.
వారం రోజులుగా ఏనుగులు రావడం, వరిచేనును పూర్తిగా ధ్వంసం చేసి వెళ్లడం వలన ఎంతో నష్టపోవాల్సివస్తోందని గిరిజనులు వాపోయారు. పోడు పంటగా పండించే కంది, పసుపు పంటలతోపాటు అరటి, కొబ్బరి, జీడి, మామిడి తోటలను నాశనం చేస్తున్నాయని బాధిత గిరిజనులు వాపోతున్నారు. ఏనుగుల ఒక్కసారిగా దాడిచేసి అరటి, పసుపు, కంది పంటలను కుమ్మేసి విరిచేస్తున్నాయని బాధిత రైతులు వాపోయారు. పోడు పంటలకు తీరని నష్టం జరిగిందన్నారు. కష్టపడి పండించిన పంటను ఏనుగులు తొండంతో పీకేయడం, కాలితో తొక్కేయడం వలన ఎందుకూ పనికిరాకుండా పోతుందని రోదిస్తున్నారు. ఏనుగుల కారణంగా ఎప్పుడు ఎలాంటి నష్టం జరుగుతుందోనని భయం భయంగా జీవిస్తున్నామని వాపోతున్నారు. అధికారులు స్పందించి ఏనుగుల గుంపు దారి మళ్లించే ప్రయత్నాలు చేయాలని గిరిజనులు కోరుతున్నారు.