ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు కలిగే నష్టం సహజంగానే ఎక్కువగా ఉంటుంది. అయితే కొన్ని సార్లు ప్రాణ నష్టం కన్నా ఆస్తి నష్టమే ఎక్కువగా సంభవిస్తుంటుంది. పెద్ద ఎత్తున ఇళ్లు, కార్యాలయాలు, ఇతర భవనాలు, నిర్మాణాలు, పంటలు.. వంటివి ధ్వంసమవుతుంటాయి. అలాంటి సమయాల్లో యంత్రాలతో వ్యర్థాలను తొలగించడం కొంత కష్టమవుతుంటుంది. అయితే యంత్రాలు కూడా చేరలేని చోటుకు సులభంగా ఏనుగులను తీసుకువెళ్లి వ్యర్థాలను తీసేయవచ్చు. అవును.. మిస్సోరిలోని జోప్లిన్ అనే ప్రాంతంలో కూడా సరిగ్గా అలాగే చేశారు.

అమెరికాలో టోర్నడోల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. పెద్ద ఎత్తున సుడిగాలి చుట్టేస్తుంటుంది. దాని ధాటికి ఏవీ నిలబడవు. అన్నీ ధ్వంసమవుతాయి. ఇక అక్కడి మిస్సోరిలోనూ టోర్నడోల ప్రభావం ఎక్కువగానే ఉంటుంది. అయితే గతంలో ఓసారి టోర్నడోలు అక్కడ పెను విధ్వంసం సృష్టించాయి. దీంతో పెద్ద ఎత్తున ఇండ్లు, ఇతర నిర్మాణాలు, పంటలు ధ్వంసమయ్యాయి. ఈ క్రమంలో ఓ దశలో అనేక చోట్లకు యంత్రాలను పంపడం కష్టతరమైంది. అయితే అలాంటి ప్రదేశాలకు ఏనుగులను పంపించి వ్యర్థాలను తొలగించారు.

సాధారణంగా ఏనుగులు అధిక బరువులను మోయగలవు. ఇక టోర్నడోలు వచ్చినప్పుడు మిస్సోరికి దగ్గర్లో ఓ సర్కస్ కంపెనీ ఉండేది. దీంతో ఆ సర్కస్‌లోని ఏనుగులను తీసుకువచ్చి భారీగా పేరుకుపోయిన వ్యర్థాలు, శిథిలాలను వెంటనే తొలగించారు. బాగా బరువుండే వ్యర్థాలను ఆ ఏనుగులు అలవోకగా తొలగించాయి. వాటికి పలు రకాల స్ట్రాప్స్ ను ఏర్పాటు చేసి అనంతరం వాటికి శిథిలాలను బరువులుగా కట్టి తొలగించారు. ఈ క్రమంలో అక్కడ పేరుకుపోయిన కొన్ని టన్నుల వ్యర్థాలను ఏనుగులు త్వరగా తీసేశాయి. అయితే బహుశా సర్కస్ తరువాత వాటిని ఈ విధంగా ఉపయోగించుకున్నది అప్పుడే కాబోలునని అంటున్నారు. ఏది ఏమైనా.. ఏనుగుల ద్వారా ఆ వ్యర్థాలను తొలగించడం అన్నది గొప్ప ఐడియా కదా..!