టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి గడ్డుకాలం నడుస్తున్నట్లుగా కనిపిస్తోంది. సర్పంచ్ లు పోరుబాట పట్టారు. చెప్పిన పనులన్నీ చేస్తున్నా.. అప్పులు ఊబిలో కూరుకుపోతున్నా తమ బిల్లులు మాత్రం రావడం లేదని సర్కారుపై సమర శంఖం పూరించేందుకు సిద్ధమౌతున్నారు.
సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని పలువురు గ్రామ సర్పంచ్ లు రాజీనామాల ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ మేరకు ఎంపీడీఓ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. గ్రామాభివృద్ధిలో భాగంగా పనులు చేయించి అప్పుల ఊబిలో కురుకుపోయామని అంతా ఆవేదన వ్యక్తం చేశారు.
తెలంగాణ ప్రభుత్వం చెప్పిన పనులు చేసే పరిస్థితిలో లేమని తేల్చి చెప్పారు సర్పంచ్ లు. సర్కార్ మళ్ళీ చేపట్టబోయే పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొనేది లేదని స్పష్టం చేశారు. చేసిన పనులకు బిల్లులు రాకపోతే మూకుమ్ముడిగా రాజీనామాలకైనా సిద్ధమని హెచ్చరించారు.
అధికారుల కింద పనిచేసే ఉద్యోగుల్లా మారిపోయిన తాము.. ఎంత కష్టపడి పనిచేసినా ప్రభుత్వం నుండి పెండింగ్ బిల్లులు రావడం లేదని వాపోయారు. కనీసం పంచాయతీ విద్యుత్ బిల్లులు కూడా చెల్లించే పరిస్థితి లేకుండా పోయిందన్నారు. తమ అధికారాలకు కోతలు పడ్డా అన్నింటిని ఓర్చుకుని ప్రభుత్వం చెప్పినట్టుగా నడుచుకుంటున్నా… బకాయిల విషయంలో పట్టించుకునే నాథుడే లేడని వాపోయారు.