ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ కోవిడ్ వ్యాక్సిన్లంటేనే భయపడిపోతున్నారు. ముఖ్యంగా రెండో బూస్టర్ షాట్ తీసుకున్న అనంతరం తాను చనిపోతున్నంతగా ఫీలయ్యానని తన అనుభవాన్ని షేర్ చేసుకున్నారు. అదృష్టవశాత్తూ శాశ్వతంగా తనకెలాంటి డ్యామేజ్ జరగలేదని, కానీ భయపడుతూనే ఉన్నానని ఆయన ట్వీట్ చేశారు. ‘రెండో దఫా వ్యాక్సిన్ తీసుకున్నాక ఎన్నో సైడ్ ఎఫెక్ట్స్ తో బాధ పడ్డా.. చాలా రోజులు చచ్చిపోతున్నంతగా అనుభూతి చెందుతూ వచ్చా’.. అని ఆయన పేర్కొన్నారు.
సెకండ్ బూస్టర్ డోసు ఎందుకు తీసుకున్నారని ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు ఆయన.. అసలు దాన్ని తీసుకోవాలనుకోలేదని, కానీ బెర్లిన్ వెళ్లేందుకు తీసుకోవలసి వచ్చిందని అన్నారు. తన దగ్గరి బంధువు, యువకుడైన తన కజిన్ ఒకరికి హెల్త్ భేషుగ్గా ఉన్నా.. కరోనా వ్యాక్సిన్ తీసుకున్న తరువాత అస్వస్థతకు గురై ఆసుపత్రికి వెళ్లాల్సివచ్చిందని మస్క్ మరో ట్వీట్ లో తెలిపారు. ఆయన మయో కార్డైటిస్ తో బాధపడినట్టు మస్క్ తెలిపారు.
వ్యాక్సిన్ ఇంకా రాక ముందు పాజిటివ్ కి గురైన తనకు స్వల్పంగా జలుబు మాత్రమే చేసిందని, దాంతో తొలి టీకా తీసుకున్నానని, కానీ ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాలేదని పేర్కొన్నారు. ‘అప్పుడు భుజం, మోచెయ్యి నొప్పితోకొంతకాలం బాధపడ్డాను. అంతే ! కానీ రెండో బూస్టర్ డోసే నాకు ప్రాణాంతకంగా పరిణమించింది’ అని ఎలాన్ మస్క్ బావురుమన్నంత పని చేశారు.
ఫైజర్ వ్యాక్సిన్ సత్తా (నాణ్యత)పై దావోస్ లో జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ మీట్ సందర్భంగా కొందరు జర్నలిస్టులు ఈ సంస్థ సీఈఓ ఆల్బర్ట్ బౌర్లా ను ప్రశ్నలడిగినప్పుడు ఆయన చాలా వాటికి సరిగా సమాధానం చెప్పకుండా కప్పదాటు వేశారు. ఆ నేపథ్యంలోనే ఎలాన్ మస్క్.. తనకు కలిగిన ‘భయంకర అనుభవాన్ని’ షేర్ చేసుకున్నట్టు తెలుస్తోంది. కోవిడ్ వ్యాక్సిన్ల వల్ల కలిగే సైడ్ ఎఫెక్ట్స్ పై ఇండియాతో సహా అనేకదేశాల్లో జరుగుతున్న డిబేట్లు ప్రాధాన్యం సంతరించుకుంటున్నాయి.