టెస్లా అధినేత, ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ 44 బిలియన్‌లు పెట్టి మైక్రో బ్లాగింగ్ సంస్థ ట్విటర్‌ను కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా ఎలాన్ మస్క్ ఆ సంస్థలో కీలక మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా సంస్థలో ఉన్నత ఉద్యోగాలు చేస్తున్న పలువురికి ఉద్వాసన పలుకుతున్నారు. తనకు అనుకూలంగా ఉండే వారికి కీలక పదవులు అప్పగించేందుకు ఎలాన్ మస్క్ ఆసక్తి చూపిస్తున్నారు.
ఈ క్రమంలో ప్రస్తుత సీఈఓ పరాగ్ అగర్వాల్‌ను ఆయన తొలగించే అవకాశం ఉందని స్పష్టమైన సంకేతాలు వస్తున్నాయి. అంతేకాదు, ట్విట్టర్ ప్రస్తుత యాజమాన్యంపై తనకు విశ్వాసం లేదని ఇటీవల ఎలాన్ మస్క్ స్పష్టం చేశారు. ఇక, గత నవంబరులో జాక్ డోర్సే స్థానంలో సీఈఓ బాధ్యతలు స్వీకరించిన పరాగ్ అగర్వాల్.. మస్క్‌కు కంపెనీని అధికారికంగా అప్పగించే వరకు ఆ పదవిలో కొనసాగనున్నారు.
అయితే, కంపెనీతో కుదిరిన ఒప్పందం ప్రకారం.. ఒకవేళ పరాగ్‌ను సీఈఓ బాధ్యతల నుంచి 12 నెలల్లోగా తీసివేస్తే అతడికి 42 మిలియన్ డాలర్లు చెల్లించాల్సి ఉంటుంది. దీనిపై కూడా మస్క్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. బోర్డులోని ఇతర సభ్యుల పరిహారంపైనా మస్క్ అసహనంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే, పరాగ్ స్థానంలో ఆయన ఎవరిని నియమించనున్నారనే విషయం మాత్రం ఇంకా తెలియాల్సి ఉంది.
అలాగే, ట్విటర్ లీగల్ హెడ్‌గా ఉన్న భారత సంతతికి చెందిన విజయ గద్దెను సైతం మస్క్ తొలగిస్తారని స్పష్టంగా తెలుస్తోంది. ఒకవేళ తొలగిస్తే కంపెనీ ఆమెకు 12.5 మిలియన్ డాలర్ల పరిహారంతో పాటు షేర్లను కేటాయించాల్సి ఉంటుంది. విజయకు ఏడాదికి 17 మిలియన్ డాలర్ల వేతనాన్ని సంస్థ చెల్లిస్తోంది. ప్రస్తుతం కంపెనీలో అత్యధిక వేతనం తీసుకుంటున్న వారిలో విజయ ఒకరు.
2011లో ట్విట్టర్‌లో చేరిన విజయ క్రమంగా టీమ్ లీడర్‌గా ఎదిగారు. ఎన్నో న్యాయపరమైన చిక్కులను ఎదుర్కొని వినియోగదారుల హక్కుల రక్షణ కోసం కీలక విధానాలను రూపొందించడంలో కీలక పాత్ర పోషించారు. 350 మంది పనిచేసే ట్విట్టర్ లీగల్ పాలసీ అండ్ సేఫ్టీ విభాగానికి విజయ నాయకత్వం వహిస్తున్నారు.
ఇక, ట్విటర్ కొనుగోలు ఒప్పందం ఖరారైన దగ్గరి నుంచీ ఉద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తమ భవితవ్యం ఏంటని పరాగ్‌ను ప్రశ్నిస్తూ ఉన్నారు. తమ ఉద్యోగ భద్రతపై నిలదీస్తున్నారు. అగర్వాల్ మాత్రం ఒప్పందం అధికారికంగా పూర్తయ్యే వరకు ఉద్యోగుల తొలగింపు ఉండదని హామీ ఇచ్చారు. తర్వాత కంపెనీ భవిష్యత్తు ఏంటన్నది మాత్రం తెలియదని ఆందోళన వ్యక్తం చేశారు.