ట్విటర్ సీఈఓ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని న్యూరాలింక్ సంస్థపై అమెరికాలో ఫెడరల్ బ్యూరో అధికారులు దర్యాప్తు ప్రారంభించారు. బ్రెయిన్ లో చిప్ అమర్చి కండరాలు, నాడీ సంబంధ పక్షవాతం, అల్జీమర్స్ వంటి వ్యాధులను నయం చేసేందుకు ఉద్దేశించిన ప్రయోగాలకు ఈ సంస్థ 2018 నుంచి ఎన్నో మూగజీవాలను చంపిందని వచ్చిన ఫిర్యాదుతో ఇన్వెస్టిగేషన్ చేబట్టారు.
జంతు సంక్షేమానికి సంబంధించిన నిబంధనలను ఈ సంస్థ అతిక్రమించిందని కొందరు ఆరోపించారు. ‘ఎనిమల్ టెస్టింగ్’ కోసం ఈ సంస్థ అనేక జంతువులను హతమార్చినట్టు తెలిపారు. ఈ బ్రెయిన్ చిప్ ను ఆరు నెలల్లో మొదట తానే తన మెదడులో అమర్చుకుంటానని మస్క్ ప్రకటించిన అనంతరం న్యూరాలింక్ వ్యవహారం పతాక శీర్షికలకెక్కింది.
నరాలు, కండరాలు చచ్చుబడిపోయిన పక్షవాత రోగులకు ఈ చిప్ ఎంతో ఉపయోగపడుతుందని ఆశిస్తున్నానని, పైగా అంధులకు దీనివల్ల మళ్ళీ దృష్టి రావచ్చునని ఆయన ఇటీవల ప్రకటించాడు. కానీ ఈ చిప్ విషయంలో ప్రయోగాలను త్వరగా ముగించాలంటూ మస్క్ .. న్యూరాలింక్ ఉద్యోగులపై ఒత్తిడి తీవ్రంగా తెస్తున్నట్టు వెల్లడైంది.
దీంతో వారు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. 2018 నుంచి ఈ కంపెనీ తమ ప్రయోగాల కోసం 1500 కు పైగా జంతువులను చంపిందని, వీటిలో 280 గొర్రెలు మేకలు, పందులు, ఎలుకలు, చుంచెలుకలు, కోతులు ఉన్నాయని తెలుస్తోంది. నిజానికి ఇంకా ఎక్కువ సంఖ్యలోనే ఈ సంస్థ జంతువులను చంపి ఉండవచ్చునని కూడా వెల్లడైంది.