ఇండియాలోని మూడు ట్విట్టర్ ఆఫీసులకు గాను రెండింటిని ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్ మూసివేశారు. ఢిల్లీ, ముంబైలలోని కార్యాలయాలను మూసివేస్తున్నామని, సిబ్బంది ఇళ్ల నుంచే పని చేయాలని ఆయన ఆదేశించారు. ఈ సంస్థలో కేవలం ముగ్గురు ఉద్యోగులు మాత్రమే ఉన్నట్టు తెలిసింది. ఖర్చులను తగ్గించుకునే యత్నంలో భాగంగా రెండు కార్యాలయాలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నామని మస్క్ పేర్కొన్నారు. . అయితే బెంగుళూరు లోని కార్యాలయం మాత్రం కొనసాగుతుందని తెలుస్తోంది.
ఇక్కడి ఆఫీసులోని ఇంజనీర్లలో చాలామంది నేరుగా అమెరికాలోని కార్యాలయంతోనే కాంటాక్ట్ కలిగి ఉంటారని, ఇండియన్ సిబ్బందిలో భాగం కారని స్పష్టమవుతోంది. గత ఏడాది చివరి నెలల్లో ఇండియాలో సుమారు 90 శాతం పైగా ..అంటే దాదాపు 200 మంది ఉద్యోగులను మస్క్ తొలగించారు.
ఆర్ధిక కష్టాల బారి నుంచి కొంతవరకైనా గట్టెక్కేందుకు ఆయన ప్రపంచ వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో సిబ్బందికి ఉద్వాసన చెప్పారు. కానీ ఇండియాను మాత్రం ‘కీ గ్రోత్ మార్కెట్’ గా మస్క్ భావిస్తున్నారు. ఇదే సమయంలో ఆయన తాజా చర్యను విశ్లేషిస్తే. ప్రస్తుతానికి మార్కెట్ కు ఆయన తక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనబడుతోందని బ్లూమ్ బెర్గ్ తెలిపింది.
44 బిలియన్ డాలర్ల వ్యయంతో ట్విట్టర్ ని ఎలాన్ మస్క్ కొనుగోలు చేసినప్పటి నుంచి వరుసగా కష్టాల బారిన పడుతూనే ఉంది. శాన్ ఫ్రాన్సిస్కో లోని ప్రధాన కార్యాలయంతో బాటు లండన్ కార్యాలయాల అద్దె చెల్లించలేక మస్క్ సతమతమయ్యారు. తమ చెల్లింపులు జరగకపోవడంతో పలు సంస్థలు ఆయనపై కోర్టుల్లో దావాలు వేశాయి. చివరకు తన కార్యాలయంలోని అనేక వస్తువులను ఆయన వేలం ద్వారా అమ్ముకోవాల్సి వచ్చింది.