టెస్లా సీఈఓ ఎలాన్ మస్క్ పై ఫెడరల్ బ్యూరో అధికారులు విచారణ జరుపుతున్నారని ట్విటర్ తెలిపింది. తమ 44 బిలియన్ డాలర్ల టేకోవర్ వ్యవహారానికి సంబంధించి ఆయన దాగుడుమూతలాడుతున్నారని ఈ సంస్థ ఆరోపించింది. ఈ మేరకు ట్విటర్ తరఫు లాయర్లు డెలావర్ కోర్టులో దాఖలు చేసిన ఫైలింగ్ లో పేర్కొన్నారు. ఈ టేకోవర్ అంశానికి సంబంధించి ఆయన ప్రవర్తనపై ఫెడరల్ అధికారులు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారని యాండర్సన్ కొరూన్ అటార్నీలు వెల్లడించారు.
ఈ నెల 6 నాటి వీరి ఫైలింగ్ గురువారం వెలుగులోకి వచ్చింది. మీ కమ్యూనికేషన్లకు సంబంధించిన వివరాలను ఫెడరల్ అధికారులకు తెలియజేయాల్సిందిగా నెలల తరబడి తాము మస్క్ తరఫు లాయర్లను ఆభ్యర్థిస్తున్నామని, కానీ వారు ఏ మాత్రం స్పందించలేదని వీరు ఆరోపించారు. పైగా మస్క్ .. ఆ అధికారులకు ఇచ్చిన డాక్యుమెంట్లను కోర్టు పరిశీలించాలని కూడా తాము కోరుతున్నామన్నారు. ఇప్పటికే ఆయన దాగుడుమూతలాడుతున్నారని, ఇకనైనా దీనికి ఫుల్ స్టాప్ పెట్టాలని ఈ కంపెనీ కోరింది. ఈ లిటిగేషన్ లో డాక్యుమెంట్లు కీలకం కానున్నాయని పేర్కొంది.
44 బిలియన్ డాలర్లతో ట్విటర్ ని తాను కొనుగోలు చేస్తానని గత ఏప్రిల్ లో మస్క్ అంగీకరించినప్పటికీ.. దీని ఫేక్, స్పామ్ అకౌంట్ల కారణంగా ఈ డీల్ ని రద్దు చేసుకుంటున్నానని ఆ తరువాత ప్రకటించాడు. అయితే ట్విటర్ దీన్ని తోసిపుచ్చుతూ ఈ డీల్ కొనసాగేట్టు చూడటానికి ఆయనపై కోర్టులో దావా వేసింది. ఈ నెల 17 న డెలావర్ కోర్టులో ఈ రెండింటి వాదనలపై విచారణ జరగనుంది.
కానీ గతవారమే ఎలాన్ మస్క్ వైఖరి మళ్ళీ మారింది. అంగీకృత ధర ప్రకారం 54.20 డాలర్ల షేర్ కి ట్విటర్ ని కొనుగోలు చేస్తానని వెల్లడించాడు. పైగా ట్విటర్ స్వాధీనం కోసం తన వంద డాలర్ల పర్ఫ్యూమ్ ని కొనాలని తన ఫ్యాన్స్ ని కోరాడు. ‘బర్నంట్ హెయిర్’ అనే పర్ఫ్యూమ్ ని ఈయన ఈ మధ్యే లాంచ్ చేశాడు. ‘దయచేసి నా ఈ సెంటును కొనండి.. దాంతో నేను ట్విటర్ ని కొనుగోలు చేస్తాను’ అని ట్వీట్ చేశాడు.
ట్విట్టర్లో మీ భారీ వాటా గురించి మీరెలా ప్రకటించారంటూ ఈ ఏడాది మొదట్లోనే యూఎస్ సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ చేంజ్ కమిషన్ మస్క్ ని ప్రశ్నించింది. అసలు మీరు యాక్టివ్ ఇన్వెస్టరా కాదా అని కూడా అడిగింది. దానికి మస్క్ నుంచి జవాబు వెళ్లలేదని తెలుస్తోంది.