టీఎస్‌పీఎస్సీలో ప్రశ్నాపత్రాల లీకేజీ వ్యవహారం కలకలం రేపుతోంది. పలు పరీక్షలకు సంబంధించిన పేపర్లు లీక్ కావడం ఇటీవల సంచలనంగా మారింది. తాజాగా గ్రూప్-1 ప్రిలిమినరి ఎగ్జామ్ పేపర్ కూడా లీక్ అయిందంటూ ఆరోపణలు వస్తున్నాయి. ఈ క్రమంలో టీఎస్‌పీఎస్సీ అలర్ట్ అయింది.
లీకేజి వ్యవహారంపై టీఎస్‌పీఎస్పీ చైర్మన్ జనార్ధన్ రెడ్డి అత్యవసర సమావేశాన్నినిర్వహించారు. మధ్యాహ్నం 3 గంటలకు కమిషన్ సభ్యులతో ఆయన సమావేశం అయ్యారు. వరుస పేపర్ లీక్ ఘటనలపై సభ్యులతో ఆయన సమావేశంలో చర్చించారు.
ఈ నెల 5న నిర్వహించిన అసిస్టెంట్ ఇంజనీరింగ్ పరీక్ష పేపర్ లీక్‌పై అధికారులు చర్చిస్తున్నారు. పేపర్ లీక్ అయినట్టు అనుమానిస్తున్న అధికారులు దాన్ని రద్దు చేసే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష పేపర్ కూడా లీకైనట్లు వస్తున్న వార్తలు కూడా సమావేశంలో చర్చకు వచ్చినట్టు తెలుస్తోంది.
సమావేశంల పూర్తయ్యాక దీనిపై సీఎస్‌కు పబ్లిక్ సర్వీస్ కమిషన్ వివరణ ఇవ్వనుంది. టౌన్ ప్లానింగ్ బిల్డింగ్ ఓవర్సీ స్ పరీక్షా పత్రం లీక్ అయినట్టు ఇటీవల అధికారులు గుర్తించారు. ఈ మేరకు ఈ నెల 13న జరగాల్సిన పరీక్షను అధికారులు వాయిదా వేశారు. పేపర్ లీక్‌కు సంబంధించి తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఉద్యోగి ప్రవీణ్, రాజశేఖర్‌లతో పాటు మరో తొమ్మది మందిని పోలీసులు అరెస్టు చేశారు.