విమాన ప్రయాణ సమయంలో చిన్న సమస్య ఏర్పడితేనే మనలో చాలా మంది ఆందోళన చెందుతారు. ఇలా సమస్యలు ఏర్పడి కొన్ని సార్లు విమానాలు కూలిపోయిన ఘటనలూ ఉన్నాయి. అందుకే విమాన ప్రయాణం అంటేనే చాలా మంది భయపడుతారు.
కానీ ఎమిరెట్స్ విమానానికి గాలీలో ఉండగా పెద్ద రంధ్రం పడింది. అయినప్పటికీ ఆ రంధ్రం అలా ఉండగానే సుమారు 14 గంటల పాటు ప్రయాణించి చివరకు సురక్షితంగా ల్యాండ్ అయింది. ఆ ఘటన తలుచుకుంటేనే ఒళ్లు గగర్లు పొడుస్తున్నాయి కదా ఆ విమానంలో వున్న వారి పరిస్థితి ఎలా వుంటుంది మరి.
వివరాల్లోకి వెళితే… జూలై 1న దుబాయ్ లోని ఎమిరేట్స్ మెయిన్ హబ్ నుంచి ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ కు ఎయిర్‌బస్ A380 విమానం బయలు దేరింది. గాల్లోకి ఎగిరిన ఆ కొద్ది సేపటికే ఆ విమానానికి పెద్ద రంధ్రం పడింది. అయితే దాన్ని పైలెట్లు గుర్తించలేదు. దీంతో అలానే విమానాన్ని నడుపుతూ బ్రిస్బేన్ లో సేఫ్ గా ల్యాండ్ చేశారు.
ల్యాండ్ అయ్యాక విమానానికి పడిన పెద్ద రంధ్రాన్ని చూసి ఎమర్జెన్సీ సర్వీస్ సిబ్బంది అవాక్కయ్యారు. ఇంత పెద్ద రంధ్రం ఎలా పడిందని అంతా ఆశ్చర్య పోయారు. ఇదిలా ఉంటే ప్రయాణికులంతా సురక్షితంగా ఉన్నారని ఎయిర్ పోర్టు అధికారులు ప్రకటించారు.
‘ గాల్లోకి ఎగిరిన కొద్ది సేపటికే పెద్ద శబ్దం వినిపించింది. దీంతో విమానం టైరు పేలివుంటుందని విమాన సిబ్బంది అంచనా వేశారు. ఈ మేరకు ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్ ఎయిర్‌పోర్టు ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వారికి కాల్ చేశారు. తమ విమానం టైరు పేలినట్లు అనుమానంగా ఉందని, ముందస్తుగా ఎమర్జెన్సీ సర్వీసులను సిద్ధంగా ఉంచండని పైలట్లు తెలిపారు. తీరా ల్యాండ్ అయ్యాక చూస్తే పెద్ద రంధ్రం గుర్తించాము’ అని ఏవియేషన్ హెరాల్డ్ రిపోర్ట్ లో పేర్కొంది.