ఏపీ ఎన్జీవో భవన్ నుంచి బీఆర్‌టీఎస్ రోడ్డు వైపు భారీ ర్యాలీ తీశారు. వేలమంది ఉద్యోగులు, ఉపాధ్యాయుల పాదయాత్రలో పాల్గొన్నారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. అర్ధరాత్రి ఇచ్చిన చీకటి జీవోలు రద్దుచేయాలని వారంత డిమాండ్ చేశారు. పీఆర్సీ జీవో రద్దు చేయాలని ముద్రించిన మాస్కులు ధరించిన ఉద్యోగులు నిరసన తెలిపారు.
ఉద్యోగులు లేకుండా ప్రభుత్వం లేదంటూ నినాదాలు చేస్తున్నారు. తీవ్రవాదుల కంటే దారుణంగా చూస్తున్నారని దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు. నేను ఉన్నాను… నేను విన్నానని ప్రతిపక్ష నేతగా జగన్ అన్నారని కానీ ఇప్పుడు అంత విడిచిపెట్టేశారని అన్నారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికే పరిమితమవడం దారుణమన్నారు. ఫ్రెండ్లీ ప్రభుత్వం అంటూ ఉద్యోగులను రోడ్డుపైకి ఈడ్చారని నిరంకుశంగా ఛలో విజయవాడను అణచివేసే చర్యలను ఖండిస్తున్నామని అన్నారు. అణచివేత కొనసాగితే ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పెకిలించేందుకు వెనుకాడమని హెచ్చరించారు ఉద్యోగులు.
సీఎం పట్టుదలకు వెళ్తే పరిస్థితి తీవ్రంగా ఉంటుందని అన్నారు. మేం ఏపీలో ఉన్నాం… పాకిస్థాన్‌లో కాదు. నిజంగా ఉద్యోగుల జీవితంలో ఇది చీకటిరోజు అంటూ నినాదాలు చేశారు. బీఆర్‌టీఎస్ వేదికపైకి అనుమతించకపోవడంతో రహదారిపైనే వేల మంది ఉద్యోగులు బైఠాయించారు.