రెడ్డొచ్చె మొదలు.. అని పాత తెలుగు సామెత మాదిరి ఇళ్ల స్థలాల సమస్య మళ్లీ మొదటికొచ్చింది.
విజయవాడ: ప్రభుత్వ ఉద్యోగులు, హైకోర్టు న్యాయవాదులు,పేద వర్గాల ప్రజలు, పూజార్లు, ఇమామ్‌లు, పాస్టర్లు, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించే అంశంపై ప్రభుత్వం ఒక మంత్రుల కమిటీ నియమించింది. ఈ వర్గాలకు ఇళ్ల స్థలాలు ఎలా ఇవ్వాలనే అంశంపై మంత్రుల కమిటీ విధివిధానాలను రూపొందిస్తుంది. మంత్రుల కమిటీకి రెవెన్యూ శాఖ మంత్రి చైర్మన్‌గా వుంటారు. మరో ముగ్గురు మంత్రులతో కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. సభ్యులుగా మంత్రులు బొత్స సత్యనారాయణ, బుగ్గన రాజేంద్రనాధ్, పినిపే విశ్వరూప్ ఇందులో ఉంటారు. ఆయా వర్గాలకు ఇళ్ల స్థలాల కేటాయింపునకు విధివిధానాలు రూపకల్పన చేస్తుందని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు, జర్నలిస్టులకు అమరావతిలో భూములు కేటాయిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆలిండియా సర్విస్ అధికారులకు కూడా అమరావతి ప్రైమ్ లొకాలిటీలో ఇళ్లస్థలాలు కేటాయించారు. దీనికి సంబంధించి అప్పట్లో ఆర్టీజీ వ్యవహారాలు చూసే అహ్మద్‌బాబు అప్పటి సీయం చంద్రబాబును ఒప్పించి ఒక్కొక్కరికీ 500 గజాల చొప్పున స్థలాన్ని కేటాయిస్తూ విధానపరమైన నిర్ణయం తీసుకునేలా చేశారు. రాత్రికి రాత్రే సీఆర్డీఏ యంత్రాంగం దీనిపై పనిచేసింది. ఏపీలో పనిచేసే ఆలిండియా అధికారులు, విశ్రాంత అధికారులు 500 చదరపు అడుగుల స్థలాన్ని వన్ డే నైట్ కూర్చుని రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. మరి ఇప్పుడు జగన్ ఏర్పాటుచేసిన మంత్రివర్గ ఉపసంఘం ఈ స్థలాల కేటాయింపును కొనసాగిస్తుందో.. లేక రద్దు చేస్తుందో చూడాలి.