కరోనా మహమ్మారి పుణ్యమా అని అప్పటి వరకు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని అవలంభించని కంపెనీలు సైతం అమలు చేయాల్సి వచ్చింది. దీంతో చాలా సంస్థలు తమ ఉద్యోగులకు ఇంటి నుంచి పని చేసుకునే వెసులుబాటును కల్పించాయి. దాదాపు రెండేళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోంకే ఐటీ ఉద్యోగులు పరిమితమయ్యారు. ఈ క్రమంలో తిరిగి కార్యాలయాలకు వచ్చి విధులు నిర్వహించాలని కంపెనీలు చెప్పినా ఆఫీసులకు వెళ్లేందుకు ఎవరూ ఇష్టపడడం లేదట.
కరోనా క్రమంగా తగ్గుముఖం పట్టడం, రోజువారి పాజిటివ్ కేసులు గణనీయంగా తగ్గడంతో ఉద్యోగులు ఆఫీసులకు రావడానికి సిద్ధంగా ఉండాలని ఆయా సంస్థలు కోరాయట. అయితే.. ఒకేసారి పూర్తిస్థాయిలో కార్యాలయాలకు రప్పిస్తే ఉద్యోగులు ఇబ్బందులు పడతారన్న ఉద్దేశంతో హైబ్రిడ్ వర్క్ కల్చర్ ను అమలు చేస్తున్నాయి. ఈ పద్ధతిలో వారంలో రెండు లేదా మూడు రోజులు కార్యాలయాల్లో పని చేయాల్సి ఉంటుంది. అయినప్పటికీ ఆఫీసులకి రావటానికి ఉద్యోగులు విముఖత చూపుతున్నట్లు తేలింది.
అంతేకాదు కచ్చితంగా ఆఫీసుకి రావాలని కంపెనీలు ఆదేశిస్తే ఉద్యోగాన్ని సైతం వదిలేసేందుకు వెనుకాడటం లేదట. ఈ విషయాన్ని సీఐఈఎల్ హెచ్‌ఆర్ సర్వీసెస్ సంస్థ ఇటీవల నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సొంతూరిలో ఇంటిల్లిపాదితో కలిసుంటూ పని చేసుకునేందుకే ఎక్కువ మంది మొగ్గు చూపుతున్నారని తెలిపింది. బ్యాచిలర్లు సహా వేలాది మంది ఐటీ ఉద్యోగులు ఇంటి నుంచి పని చేసేందుకే మొగ్గు చూపుతున్నారు.
నగరానికి వచ్చి వేల రూపాయలు వెచ్చించి అద్దె ఇళ్లు, హాస్టళ్లలో ఉంటూ దూర ప్రయాణాలతో ఇబ్బందులు పడటం ఎందుకనే ఆలోచనతో వారు ఉంటున్నారట. అదే ఇంటి నుంచే పని చేస్తే ఆ డబ్బును ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు ఉద్యోగులు కార్యాలయాల్లో సదుపాయాలు కొంత మెరుగుపరిచాక వస్తామని చెబుతున్నారని సర్వేతో తేలింది.