తెలంగాణ, ఛత్తీస్‌గఢ్ సరిహద్దు కాల్పులతో మరోసారి మార్మో మోగింది. ములుగు జిల్లా వెంకటాపురం మండలం నూగురు వద్ద భారీ ఎన్‌కౌంటర్ జరిగింది. పోలీసులు, మావోయిస్టుల మధ్య జరిగిన ఎదురు కాల్పుల్లో నలుగురు మావోయిస్టులు మృతి చెందారు. మావోయిస్టులు కాల్పుల్లో జవాన్‌కు సైతం తీవ్రగాయలు అయినట్టు తెలుస్తోంది.
మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఈ రోజు ఉదయం 7 గంటలకు తెలంగాణ – ఛత్తీస్‌గఢ్ బీజాపూర్ సరిహద్దులో ఉన్న కర్రెలగుట్ట సమీపంలో ఎన్ కౌంటర్ జరిగింది. మావోయిస్ట్ ఏటూరు నాగారం మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ సభ్యులే ఈ ఎదురు కాల్పుల్లో ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో ఒకరిని ఏటూరు నాగారం మహదేవ్‌పూర్ ఏరియా కమిటీ సెక్రెటరీ సుధాకర్‌గా పోలీసులు గుర్తించారు.
మిగిలిన వారి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటన స్థలంలో పోలీసులు ఆయుధాలను, మందుగుండ సామగ్రి స్వాధీనం చేసుకున్నారు. ఇంకా ఆ ప్రాంతంలో కూంబింగ్ కొనసాగుతోంది. మూడు నెలల క్రితం కూడా ములుగు జిల్లాలో ఎన్‌కౌంటర్ జరిగింది. వాజేడు మండలం పేరూరు పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఎన్ కౌంటర్ లో ముగ్గురు మావోయిస్టులు చనిపోయారు.
ఇక ఇటీవల ఏటూరునాగారంలో ఓ మాజీ సర్పంచ్‌ను మావోయిస్టులు కాల్చి చంపారు. పోలీస్ ఇన్ఫార్మర్ అంటూ కిడ్నాప్ చేసిన మావోయిస్టులు కిడ్నాప్ తర్వాత ఇరవై నాలుగు గంటల్లోనే హతమార్చారు. తరువాత పోలీసులు ఈ ప్రాంతంలో భద్రతను పెంచారు.