భారత్ లో ఎన్నికల రాజకీయాలపై ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా దిగ్గజాల ప్రభావానికి ముగింపు పలకాలని కేంద్రాన్ని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ కోరారు. లోక్ సభలో జీరో అవర్ సందర్భంగా బుధవారం ఆమె మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఇతర పార్టీలతో పోలిస్తే బీజేపీకి ఫేస్ బుక్ తక్కువ ధరలకే అడ్వర్ టైజ్ మెంట్లను తక్కువ ధరకే ఆఫర్ చేసిందన్న అల్ జజీరా కథనాన్ని లోక్ సభ ముందు ఆమె ఉంచారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వారిని టార్గెట్ చేసేందుకు ఫేస్‌బుక్, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లను ఎలా దుర్వినియోగం చేస్తున్నారో ఈ సందర్భంగా ఆమె వివరించారు. కొన్ని రాజకీయ పార్టీలకు సోషల్ మీడియా కంపెనీలు అనుకూలంగా వ్యవహరిస్తూ మరికొన్ని పార్టీల పట్ల వివక్ష చూపుతున్నాయని ఆమె ఆరోపించారు.
పాలక వ్యవస్థ సహకారంతో ఫేస్ బుక్ ద్వారా సామాజిక సామరస్యానికి భంగం కలిగిస్తున్న కఠోరమైన విధానం మన ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని ఆమె అన్నారు. తప్పుడు సమాచారం, భావోద్వేగాలు రెచ్చగొట్టం లాంటి చర్యల ద్వారా యువకులు, వృద్ధుల్లో ద్వేషాన్ని ఫేస్ బుక్ లాంటి ప్రాక్సీ అడ్వర్ టైజ్ మెంట్ కంపెనీలు నింపుతున్నాయని చెప్పారు. ఈ విషయం ఫేసుబుక్ కు తెలుసని, దాని నుంచి ఫేస్ బుక్ లాభాలు పొందుతోందని పేర్కొన్నారు.
ప్రపంచంలోనే అతి పెద్దదైన ప్రజాస్వామిక దేశంలోని ఎన్నికల రాజకీయాల్లో ఫేస్ బుక్, ఇతర సోషల్ మీడియా కంపెనీల జోక్యాన్ని, ప్రభావానికి ముగింపు పలకాలని కేంద్రాన్ని కోరుతున్నానని చెప్పారు. అధికారంలో ఏ ప్రభుత్వం ఉందన్న అంశంతో సంబంధం లేకుండా మనమంతా సామాజిక సామరస్యాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అని పిలుపునిచ్చారు.