జార్ఖండ్‌లో ఈడీ దాడులు కలకలం రేపుతున్నాయి. జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ తో పాటు ఆయన సన్నిహితుల ఇండ్లలో ఈడీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 18 ప్రాంతాల్లో ఈడీ దాడులు కొనసాగుతున్నాయి. ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ రాజకీయ ప్రతినిధి ప్రకాష్ మిశ్రాకు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో ఈ దాడులు జరుగుతున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం.
సాహెబ్ గంజ్ తో పాటు బెర్హత్, రాజ్ మహల్ గ్రామాల్లో మనీలాండరింగ్ నిరోధక చట్టం పీఎంఎల్ఏ కింద సోదాలు జరుపుతున్నట్టు అధికారులు పేర్కొన్నారు. ముందస్తు చర్యల క్రింద పారామిలటరీ బలగాల సహాయాన్ని ఈడీ అధికారులు తీసుకున్నారు.
దీంతో పాటు రాష్ట్రంలో ఇద్దరు వ్యాపారుల ఇండ్లల్లోనూ ఈడీ అధికారులు దాడులు చేస్తున్నట్టు సమాచారం. బరహద్వా, పాట్నా జిల్లాల్లో గ్రానైట్ స్టోన్ వ్యాపారులు క్రిష్టాసాహ, భగవాన్ భగత్ ల ఇండ్లల్లో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు.
ఇటీవల రాష్ట్రంలో అక్రమ మైనింగ్ కేసులో ఐఏఎస్ అధికారి పూజా సింఘాల్ ను ఈడీ అధికారులు అరెస్టు చేశారు. ఈ క్రమంలో అక్రమ మైనింగ్ కేసులో పంకజ్ మిశ్రాపైనా ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ క్రమంలో ఆయనపై దర్యాప్తును ఈడీ ముమ్మరం చేసింది. త్వరలోనే పంకజ్ ను ఈడీ ఇంటరాగేట్ చేయనున్నట్టు చెప్పారు.