- ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కబ్జా నిధుల పై ఈడీ నిఘా
- లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డికి బిగుస్తున్నఉచ్చు
- షెల్ కంపెనీలతో ఎన్నారైలకు బ్లాక్ మనీ పంపింగ్
- రాజకీయ పలుకుబడితో బయటపడేందుకు ప్రయత్నాలు..
- ప్రధాని,హోంమంత్రి పేర్ల దుర్వినియోగం..?
- ప్రధానితోనే మాట్లాడతానని లింగమనేనికి మేఘా అభయహస్తం..?
- పోలీసులకు బంగారు బాతులా ఎన్ఆర్ఐ కేసు
- మేఘా బాగోతం పార్టీ -6
తొలివెలుగు క్రైంబ్యూరో, హైదరాబాద్ : భారీ ఎత్తున బ్లాక్ మనీని వైట్ చేయాలి. ఇదే “మెగా” టార్గెట్.ఈ దందాను బట్టబయలు చేస్తోంది తొలివెలుగు.తాజాగా మంగళగిరి ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజీ కబ్జా వ్యవహారంలో అక్రమంగా నిధులు విదేశాలకు మళ్లించినట్లు గుర్తించారు. ఆ షెల్ కంపనీల వ్యవహారం లింగమనేని రమేష్, మేఘా కంపనీ మెడకు చుట్టుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. యాజమాన్య మార్పిడిపై జరిగిన వివాదంలో పెద్ద ఎత్తున మనీ లాండరింగ్ జరిగినట్టు అనుమానాలు వ్యక్తమవుతుండడంతో ఈ వ్యవహారంపై ఈడీ కన్నుపడింది. విజయవాడకు చెందిన లింగమనేని రమేష్, మేఘా కృష్ణారెడ్డిల పాత్రపై ఈడీకి పక్కా ఆధారాలు దొరికినట్టు తెలుస్తోంది. వీరిపై దర్యాప్తుచేయాలని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు యోచిస్తుండగా,రాజకీయ పలుకుబడితో దీన్నుంచి బయటపడేందుకు వీరిద్దరూ ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నారు.
లింగమనేని బ్లాక్ లీలలు ఇవే..?
ఈడీ అధికారుల సమాచారం ప్రకారం లింగమనేని రమేష్ ఆస్తులు దాదాపు 5 వేల కోట్లపైనే వున్నాయి.కటిక పేదరికంలో పెరిగిన రమేష్ ఇతరుల పెట్టుబడులతో రియల్ ఎస్టేట్ బిజినెస్ మొదలుపెట్టాడు. ఆస్ట్రేలియాలో వుంటున్న బొబ్బా శివప్రకాష్ ను రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేలా ఒప్పించి, ఆ మొత్తంతో ఇద్దరి భాగస్వామ్యంలో విజయవాడలో రియల్ఎస్టేట్ వ్యాపారం షురూ చేశాడు. విజయవాడ సమీపంలో మద్రాసు-కలకత్తా హైవే పక్కనే బొబ్బా శివప్రకాష్ కు చెందిన 60 ఎకరాల్లో రెయిన్ ట్రీ పార్క్ పేరుతో అతి పెద్ద ప్రాజెక్టు నిర్మించాడు. ఆ తరువాత పలువురు ప్రముఖుల వద్ద వందల కోట్లు వసూలు చేసి రియల్ ఎస్టేట్ రంగంలో, ఎయిర్ కోస్టా పేరుతో ప్రారంభించిన విమానయాన కంపెనీలో పెట్టుబడులు పెట్టాడు. వీరి పుట్టుపూర్వోత్తరాలను ఈడీ సేకరించినట్లు తెలుస్తుంది. రమేష్ కు వివిధ రూపాల్లో డబ్బిచ్చినవారిలో చైతన్య విద్యాసంస్థల యాజమాన్యం, మాజీ స్పీకర్, జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్, శ్రీమతి విజయలక్ష్మి, మాజీ సీఎం చంద్రబాబు కుమారుడు నారా లోకేష్, దివంగత కోడెల శివప్రసాదరావు, ముక్కామల అప్పారావుతో సహా పలువురు ప్రముఖులున్నారనే విషయాన్ని పసిగట్టారు. పెట్టుబడుల పేరుతో వీరి నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్న లింగమనేని రమేష్ రకరకాల సాకులతో వీరందరికీ డబ్బు ఎగ్గొట్టి, పెద్ద ఎత్తున ఆస్తులు కూడబెట్టాడరనే అరోపణలు ఉన్నాయి. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తనకు సన్నిహితుడని చెబుతూ పలువురు ఎన్నారైల నుంచి లక్షల డాలర్లు వసూలు చేశారు.ఈడీ అధికారుల వద్ద వున్న సమాచారం ప్రకారం కేవలం డబ్బు వసూలు చేయడానికే ఒక కంపెనీ స్థాపించారు. దాని అడ్రస్ తో పాటు లావాదేవిలను గుర్తించారు. LEPL USA INC, 15097771, 5665, Peachtree Parkway, Suite 200, Norcross, GA, 30092, USA చిరునామాలో 2015 అక్టోబరు 9న ఏర్పాటు చేసిన ఈ కంపెనీ ఎకౌంటు ద్వారా ఎన్నారైల నుంచి పెట్టుబడులు స్వీకరించాడు. ఎలాంటి వ్యాపార కార్యకలాపాలు జరపకుండానే లక్షల డాలర్లు ఈ కంపెనీ ఖాతాలోకి రావడంతో ఈడీ అధికారులు షాక్ అయ్యారు. సదరు వ్యవహారాన్ని విచారించాలని FBI ని కోరినట్లు సమాచారం. ఇదంతా మేఘాతో చేతులు కలిపి ఎన్నారై అకాడమీని చేజిక్కించుకునేందుకు కుట్ర చేయడం..అందుకు అవసరమైన డబ్బులు పంపించటంతో బినామీల వ్యవహారం బట్టబయలు అయింది.
కాలేజీ కబ్జాతో అసలుకే ఎసరు వస్తున్న తీరు.?
మంగళగిరిలో ఎన్నారై అకాడమీ ఆఫ్ సైన్సెస్ ను ప్రభుత్వ అధికారుల అండదండలతో అక్రమంగా చేజిక్కించుకోవాలని చూశారు అనతి కాలంలోనే ఎదిగిన మేఘా కంపెనీ ఎండీ పురిటిపాక వెంకట కృష్ణారెడ్డి . ఈ వ్యవహారం పై తొలివెలుగు క్రైం బ్యూరో మేఘా భాగోతాలు పార్ట్ -5లో ప్రచురించింది. అకాడమీ బైలాస్ ప్రకారం సభ్యత్వాలను బదిలీ చేసేందుకు గానీ, రద్దు చేసేందుకు గానీ కుదరకపోవడంతో కృష్ణారెడ్డి షెల్ కంపనీలతో డబ్బులను పంపించి సభ్యులను ప్రలోభపెట్టి తన పవరేంటో చూపించాడు. పథకం ప్రకారం కమిటీ నుంచి రాజీనామా చేస్తే కోట్ల రూపాయల డబ్బిస్తామని సభ్యులను లొంగతీసుకున్నారు. రాజీనామా చేయడానికి సుముఖత వ్యక్తం చేయని వారిని బెదిరించారు. ఈడీ దగ్గరున్న సమాచారం ప్రకారం ఈ మొత్తం వ్యవహారంలో లింగమనేని రమేష్ ద్వారా ముక్కామల అప్పారావు, నరసరాజు, హనుమయ్య బండ్ల, ఎర్నేని నవీన్, కొత్తపల్లి శ్రీనివాస్ లతో పాటు మరి కొంత మందికి మేఘా కృష్ణారెడ్డి వందల కోట్ల రూపాయలు చెల్లించాడు. దీనికి సంబంధించిన కీలక ఆధారాలను ఈడీ సేకరించింది. సినిమా ప్రొడ్యూసర్లు డబ్బును తిరిగి ఇక్కడ సినిమా నిర్మాణం చేసినట్లు అదారాలు ఉన్నాయి. ఈ కుట్రలో పలువురు ఎన్నారై డాక్టర్లకు కూడా కృష్ణారెడ్డి పెద్దమొత్తంలో డబ్బు చెల్లించాడు. అమెరికాలో ట్యాక్స్ అథారిటీస్ దృష్టిలో పడకుండా వుండేందుకు కొత్తపల్లి శ్రీనివాస్ ఈ డబ్బును స్విట్జర్లాండ్ లో డిపాజిట్ చేశాడు. ఇంత చేసినప్పటికీ అకాడమీ యాజమాన్య బదిలీ అనేది బైలాస్ లో లేనందున అది కుదరలేదు. ఈ వ్యవహారానికి సంబంధించి, ప్రద్యుతి వెంచర్స్ ఎల్ ఎల్ పి కి చెందిన ఇండస్ ఇండ్ బ్యాంక్ ఎకౌంట్ ద్వారా పలు అనుమానాస్పద లావాదేవీలు జరిగినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. విజయవాడలో లెక్సస్ అనే కంపెనీకి చెందిన 20 ఎకరాలను ఫోర్జరీ డాక్యుమెంట్ల ద్వారా చైతన్య విద్యాసంస్థలకు కట్టబెట్టి పెద్ద మొత్తంలో డబ్బు చేసుకున్నారు. ఈ కేసులో కూడా మనీ లాండరింగ్ జరిగినట్టు ఈడీ దృష్టికి రావడంతో దీనిపై కూడా దర్యాప్తు చేస్తున్నారు.ఎన్ని ప్రయత్నాలు చేసినప్పటికీ అకాడమీలో మెజారిటీ సభ్యుల మద్దతు కూడగట్టలేకపోవడంతో అధికారయంత్రాంగం మద్దతుతో,కుట్రలు చేసి చట్టవిరుద్ధంగా వీరు అకాడమీ యాజమాన్య బాధ్యతలు లాక్కున్నారు.
పోలీసులకు బంగారు బాతులా ఎన్నారై కబ్జా కేసు!
చట్టవిరుద్ధంగా అకాడమీ యాజమాన్యాన్ని టేకోవర్ చేసిన వ్యవహారంలో దాఖలైన ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకుండా వుండేందుకు,తమ వర్గానికి సహకరించేలా మేఘా వద్ద నుంచి తీసుకున్న సొమ్ములో లింగమనేని రమేష్ పోలీసుల కోసమే 5 కోట్ల రూపాయలు వెచ్చించారనే తీవ్రమైన అరోపణలు ఉన్నాయి. ఆ ప్యాకేజీలో భాగంగా ఓ పోలీస్ అధికారికి హైదరాబాద్ లో అపార్ట్ మెంట్ కొనుగోలు చేసి ఇచ్చారు. ఇరువైపులా డబ్బులు దండుకోవచ్చని అనుకుంటున్న పోలీసులు బరితెగించారు. అటు మేఘా నుంచే కాకుండా నిందుతుల వద్ద నుంచి భారీగా డబ్బులు డిమాండ్ చేస్తున్నారు. ఈ వ్యవవహారం పై తొలివెలుగు క్రైంబ్యూరో వద్ద అన్నిఆధారాలు ఉన్నాయి. ఓ అధికారి అరెస్ట్ కాకుండా ఉండాలంటే.. 25 లక్షలు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు. ఇక నోటీసులు ఇచ్చేందుకు వచ్చిన అధికారులు సైతం హైదరాబాద్ లో షాపింగ్ చేసేందుకు 50 వేల నుంచి లక్ష డిమాండ్ చేశారు.ఎన్నారై మెడికల్ కాలేజ్ కి చెందిన కారులో పోలీసులు హైదరాబాద్ లో తిరుగుతున్నారు.. నోటీసుల పేరుతో అర్ధరాత్రి ఫౌండర్స్ సభ్యుల ఇళ్లలోకి వెళ్లి ఇబ్బందులకు గురిచేస్తున్నారు. డబ్బులు ఇవ్వకపోతే.. గంటల కొద్దీ కుటుంబసభ్యులను భయాందోళనలకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారు. ఈ తతంగమంతా సి.సి.టీవీ రికార్డుల్లో నమోదు కావటం గమనార్హం. అయితే అకాడమీలోని మెజారిటీ సభ్యులు 18 మంది కోర్టుకు వెళ్లడంతో, ప్రస్తుతం యాజమాన్య బదిలీ అంశంపై కోర్టు విచారణ జరుగుతోంది. ఈ కేసులో కోర్టులను కూడా తప్పుదోవ పట్టించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నట్లు సభ్యులు ఆరోపిస్తున్నారు. తనకు న్యాయశాఖలో చాలా పరిచయాలు ఉన్నాయంటూ. మేనేజ్ చేయడానికి పెద్ద మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తెలుస్తోంది.
మోసగాళ్లకి కృష్ణారెడ్డి అభయం !
ఈడీ ఆరా పై మేఘా అభయహస్తం ఇచ్చారని రమేష్ సన్నిహితులు జబ్బలు చరుచుకుంటున్నారు. తాను ప్రధానమంత్రికి, కేంద్ర హోమ్ మంత్రికి, ఎపి సీఎం జగన్ కు అత్యంత సన్నిహితుడిననీ..ఈడీ వ్యవహారంలో మీకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తానని కృష్ణారెడ్డి హామీ ఇచ్చారని బహిరంగానే చర్చించుకుంటున్నారు. అయితే దేశంలోని పలు రాష్ట్రాల్లో వ్యాపార సామ్రాజ్యాలు నెలకొల్పిన కృష్ణారెడ్డి ప్రధాని మోడీతో తనకున్న సంబంధాల ద్వారా మనీలాండరింగ్ కేసులో ఈడీ విచారణ ప్రారంభించకుండా ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నాడని ఫౌండర్ మెంబర్స్ ఆరోపిస్తున్నారు.. అయితే, FBI నుంచి నివేదిక వచ్చాక మేఘా కృష్ణారెడ్డి, లింగమనేని రమేష్ వ్యవహారంపై దర్యాప్తు చేపట్టాలని ఈడీ యోచిస్తోంది.