ఇంటర్నేషనల్ క్రికెట్ కు ఇంగ్లాండ్ స్టార్ క్రికెటర్ ఇయాన్ మోర్గాన్ గుడ్ బై చెప్పాడు. అన్ని రకాల క్రికెట్ ఫార్మాట్ల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ప్రొఫెషనల్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించాడు. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా వెల్లడించాడు. తన క్రికెట్ ప్రయాణంలో అండగా నిలిచిన కుటుంబ సభ్యులు, స్నేహితులు, సహచరులు, కోచ్ లు, అభిమానులకు ధన్యవాదాలు చెప్పుకొచ్చాడు.
క్రికెట్ కు ధన్యవాదాలు. క్రికెట్ నాకు ఎన్నో జ్ఞాపకాలను అందించింది. నా క్రికెట్ ప్రయాణంలో ఎంతో మందిని కలిశానని, ప్రపంచాన్ని చుట్టి వచ్చానని తెలిపాడు. ఎన్నో జట్ల తరపున ఆడటం గౌరవంగా భావిస్తున్నా. రిటైర్మెంట్ ప్రకటించిన నేపథ్యంలో తాను క్రికెట్ లో ఉండే సాహసం, సవాళ్లను కోల్పోతానని చెప్పుకొచ్చాడు. రిటైర్మెంట్ అనంతరం కుటుంబంతో ఎక్కువ సమయం గడుపుతానని తెలిపాడు మోర్గాన్.
కాగా ఐర్లాండ్ తరపున 2006లో క్రికెట్ లో అరంగేట్రం చేశాడు ఇయాన్ మోర్గాన్. ఆ తర్వాత 2009లో ఇంగ్లండ్ తరఫున తన తొలి మ్యాచ్ ఆడాడు. 2015లో ఇంగ్లాండ్ జట్టుకు కెప్టెన్ అయ్యాడు. ఆ తర్వాత 2019లో కెప్టెన్ గా ఇంగ్లాండ్ కు తొలి వన్డే వరల్డ్ కప్ ను అందించాడు.
తన క్రికెట్ కెరీర్ లో మొత్తం 16 టెస్టులు ఆడిన మోర్గాన్.. 700 పరుగులే చేశాడు. బెస్ట్ స్కోరు 130 పరుగులు. ఇక 248 వన్డేల్లో 7701 పరుగులు సాధించాడు. ఇందులో 14 సెంచరీలు, 47 అర్థ సెంచరీలున్నాయి. 115 టీ20ల్లో 14 హాఫ్ సెంచరీలతో సహా 2458 పరుగులు చేశాడు.
— Eoin Morgan (@Eoin16) February 13, 2023